ప్రపంచాన్ని ముఖ్యంగా చైనాను కరోనా కొత్త వేరియంట్లతో హడలెత్తిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ దేశంలో లక్షలాది మంది వైరస్ బారిన పడతారని అంచనా. ఇప్పటికే రోగులతో చేపల మార్కెట్లా మారిన ఆసుపత్రుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధ్యమైనంతవరకు ఆ దేశంలోని ప్రజలు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ సింగర్ జేన్ జాంగ్ మాత్రం కావాలనే కరోనా అంటించుకుంది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి విచిత్ర కారణం చెప్తోంది. త్వరలో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుందన్నది తెలిసిందే. ఆ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనేందుకే ఇప్పుడు కరోనా అంటించుకున్నానని స్పష్టం చేసింది. ఒకరోజు మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయని, పగలు రాత్రీ నిద్రపోవడం వల్ల, సీ విటమిన్ ఫుడ్ తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడంతో తగ్గిపోయిందని వివరించింది. ఇప్పుడు కరోనా వచ్చి పోయినందున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కరోనా రాదని, హ్యాపీగా ఈవెంట్లలో పాల్గొనవచ్చని తన ప్రణాళికగా చెప్తోంది. ఒకవేళ న్యూ ఇయర్ రోజు కరోనా సోకితే తనతో పాటు తన టీం అందరికీ ఇబ్బందేనని తెలిపింది. ఈ పోస్టు వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనాతో దేశం అతలాకుతలమవుతున్న వేళ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు దుయ్యబట్టారు. దీంతో జాంగ్ తన పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది.