మే 31న పాట పాడుతూ చనిపోయిన ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (53) గురించి ఆసక్తికర విషయం బయటపడింది. అన్ని భాషల్లో కలిపి 800 పాటలు పాడిన కేకే.. అనేక ప్రకటనలకు సైతం తన గొంతునిచ్చాడు. కానీ, ఏనాడు కూడా పెళ్లిలో పాడలేదని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. 2008లో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించాడు.
‘ఇప్పటివరకు మీరు ఏదైనా ఆఫర్‌కు నో చెప్పారా?’ అని అడిగిన ప్రశ్నకు ‘ఒకసారి ఇలా జరిగింది. ఓ పెళ్లి కార్యక్రమంలో పాడమని అడిగితే కుదరదని సూటిగా చెప్పేశా. కోటి రూపాయలిస్తామని డబ్బు ఆశ చూపారు. అయినా సరే చేయనని కరాఖండీగా చెప్పేశా. అంతేకాక, డబ్బుల కోసం నేను నటించలేను. కొన్నేళ్ల క్రితం ఓ సినిమాలో నటించమని ఆఫర్ వచ్చింది. కానీ నో చెప్పాను’ అని సమాధానమిచ్చారు. కాగా, కేకే మృతి పట్ల పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.