గాయకుడు సిద్దూ కాల్చివేత.. ఆ గ్యాంగ్‌స్టరే పనే - MicTv.in - Telugu News
mictv telugu

గాయకుడు సిద్దూ కాల్చివేత.. ఆ గ్యాంగ్‌స్టరే పనే

May 30, 2022

ప్రముఖ పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి సిద్ధూ జీప్‌లో వెళ్తుండగా, మాన్సా జిల్లా జవహర్‌ కె గ్రామం వద్ద గుర్తు తెలియని కొంతమంది దుండగులు నడిరోడ్డుపై ఏకే-47 తుపాకితో సిద్దూపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధూను, ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆప్ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సిద్ధూను హత్య‌ చేసింది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ అని, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు కెనడాలో ఉండే లక్కీ అలియాస్ గోల్డీ బ్రార్ బాధ్యుడని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. ‘బిష్ణోయ్ సన్నిహితుడు విక్కీ మిద్దుఖేడా మొహాలీలో గత ఏడాది హత్యకు గురికావడంతో, సిద్ధూ మేనేజర్‌ శగన్‌ప్రీత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో శగన్‌ప్రీత్‌ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. విక్కీ హత్యకు ప్రతీకారంగానే బిష్ణోయ్‌ ముఠా ఆదివారం సిద్ధూను కాల్చి చంపింది’ అని పోలీసులు వివరాలను వెల్లడించారు.

మరోపక్క సిద్ధూ హత్యకు బాధ్యత వహిస్తున్న గోల్డీ బ్రార్‌ గ్యాంగ్‌స్టర్‌ ఫేస్‌బుక్‌లో ‘ఈ హత్యకు పాల్పడింది మేమే’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టాడు. గతేడాది హత్యకు గురైన విక్కీ మిద్దుఖేడా మొహాలీ విషయంలో సిద్ధూ పాత్రపై ఇప్పటివరకూ పోలీసులు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆ కారణంగానే ఈ హత్యకు పాల్పడ్డామని ఆ పోస్టులో రాసుకొచ్చారు.