ఎస్పీ బాలు పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్పీ బాలు పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

August 14, 2020

టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇటీవలే ఆయనకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌ విడుదల చేశాయి. ‘ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆగస్టు 5వ తేదీన ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతోన్న ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయనను ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కాగా, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. అయినా చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలుపుతూ ఆయన ఆగస్టు 5న ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియోలో పేర్కొన్నారు.  మూడు రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. కరోనా పరీక్షల్లో తనకు కరోనా సోకినట్టు, మందులు ఇచ్చి హోంక్వారంటైన్‌లో ఉండమని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు. అయితే కుటుంబసభ్యులను ఇబ్బందుల్లో పడేయటం ఇష్టంలేక ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.