ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ మొట్టమొదటి మహిళా బస్సు డ్రైవర్ల సముదాయంలోకి ప్రియాంక శర్మ చేరింది. అనేక కష్టాలను అధిగమించి, స్ఫూర్తిదాయకమైన కథను నడిపిస్తున్న ఆ ఒంటరి తల్లి కథనం ఇది..
బస్ డ్రైవర్ అనే పదం వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. ఖాకీ యూనిఫామ్ లో భారీ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి. మహిళలు ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి, దేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై భారీ వాహనాలను నడిపే సామర్థ్యాన్ని కలిగి లేరని అపోహ ఉండేది. ప్రియాంక శర్మ ఈ మూస పద్ధతిని బద్దలు కొట్టింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ బస్సును నడిపిన మొదటి మహిళగా గుర్తింపు సాధించింది.
పిల్లల కోసం..
రాష్ట్ర బస్సులను నడుపడానికి ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నియమించిన 26 మంది మహిళల్లో మొదట స్టీరింగ్ ఎక్కింది ప్రియాంక శర్మ. కష్టతరమైన నేపథ్యం నుంచి వచ్చింది. కష్ట సమయాల్లో ఉద్యోగ నియామకం ఒక ఆశీర్వాదంగా భావించింది. యూపీ ప్రభుత్వ బస్సులను నడుపడానికి బాధ్యత వహించిన మహిళా డ్రైవర్ల మొదటి బ్యాచ్ మహిళ ప్రియాంక కూడా ఒకరు. ఆమె భర్త మద్యానికి బానిసై వివాహమైన తొలినాళ్లలోనే చనిపోయాడు. వారు నలుగురు సభ్యుల కుటుంబం. అతను పోయిన తర్వాత ఇద్దరు పిల్లలను పోషించే బాధ్యత ప్రియాంక పై పడింది. తన పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడానికి సహాయపడే అవకాశాల కోసం ఆమె ఢిల్లీకి చేరింది. 2016లో ఫ్యాక్టరీలో హెల్పర్ గా పని చేయడం ప్రారంభించింది. అక్కడే డ్రైవింగ్ నేర్చుకుంది. డ్రైవింగ్ పై అవగాహన పొందడానికి, డ్రైవింగ్ కోర్సులను కూడా తీసుకుంది. భారీ వాహనాల స్టీరింగ్ పై బలమైన పట్టు సాధించింది.
శిక్షణ తర్వాత..
డ్రైవింగ్ కోర్సు తర్వాత.. ముంబైకి వెళ్లింది ప్రియాంక. అక్కడి నుంచి బెంగాల్, అస్సాం వంటి వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించింది. 2020లో మహిళా డ్రైవర్ల కోసం యోగి ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసింది. దానికోసం ప్రియాంక అప్లయి చేసింది. శిక్షణ ప్రక్రియ కోసం వెంటనే సంప్రదించారు. మే నాటికి ఆమె ఉత్తీర్ణత సాధించింది. సెప్టెంబర్ లో పోస్టింగ్ కూడా అందుకుంది. జీతం ఎక్కువ కానప్పటికీ ప్రభుత్వం కోసం పని చేయడం గర్వంగా ఉందని చెబుతున్నది ప్రియాంక శర్మ.