విమానంలో ఒకేఒక్కడు.. చల్నేదో గాడీ - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో ఒకేఒక్కడు.. చల్నేదో గాడీ

April 5, 2020

Single passenger flights: The daily woes of airlines, and the crew still working

కరోనా వైరస్  ప్రభావంతో ప్రభుత్వాలు ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దగ్గర దగ్గర నెల నుంచి దేశ విదేశాల్లో జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. లాక్ డౌన్ కారణంగా రోడ్లు కూడా మూతపడ్డాయి. అటు జలమార్గంలోనూ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. దీంతో ఎయిర్ లైన్స్ కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు మాత్రం విమానాలు నడుపుతున్నాయి. ఒక్క ప్రయాణికుడు ఉన్నా చాలు, చల్నేదో గాడీ అంటున్నాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 4511లో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ఉండటం విశేషం. వాషింగ్టన్ రీగన్ నేషనల్ విమానాశ్రయం నుంచి న్యూ ఆర్లీన్స్‌కు ఆ విమానం వెళ్తుంది. 

76 సీట్లు ఉన్న అందులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఎక్కాడు. ఆ విమానంలో పైలట్లు, సిబ్బంది ఉన్నారు. ఒక్క ప్రయాణికుడితో గిట్టుబాటు ఏం కాదు అయినా వారు విమానాలు నడుపుతున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ నడుపుతున్న 119 విమానాల్లోని 8 విమానాల్లో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రయాణిస్తున్నారు. ‌ ఇదిలావుండగా న్యూజిలాండ్‌కు చెందిన ఓ ఎయిర్ లైన్స్ సంస్థ.. ప్రయాణికులు లేకపోయినా 20 విమానాలను నడిపిస్తోంది. ఏప్రిల్ 1న కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడితో 20 విమానాలు నడిపారు. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉందని ఎయిర్స్ లైన్స్ యాజమాన్యం వాపోయింది. కరోనా భయంతో ఒకరిద్దరి కంటే ఎక్కువమంది ప్రయాణికులు కంటే ఎక్కువ బయటకు వెళ్లడం లేదు అని చెప్పారు. అయితే కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో విమానాలు ఎలా నడుపుతారనే విమర్శలు కూడా ఎదురు అవుతున్నాయి. ఆ ఒక్క సంస్థే నష్టాల్లో లేదని.. దాదాపు అన్నీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి, తప్పదుగా అని కామెంట్లు చేస్తున్నారు.