వన్, టూ పర్సెంట్ తప్పేంటి.. అక్కా నీ నిజాయతీకి దండాలు! - MicTv.in - Telugu News
mictv telugu

వన్, టూ పర్సెంట్ తప్పేంటి.. అక్కా నీ నిజాయతీకి దండాలు!

March 17, 2018

మనిషి అంటే అలా ఉండాలి. ఏమాత్రం తొణక్కుండా మనసులోపల ఏముందో దాపరికం లేకుండా చెప్పేయాలి. విషయాన్ని తెగ నాన్చకుండా భళ్లున కక్కేయాలి. భూమి బద్దలైనా, ఆకాశం విరిగిపడినా బెదరకుండా అదరకుండా అనేయాలి. తర్వాత ఏం జరుగుతుందనే వేరే విషయం! సిరిసిల్ల చైర్ పర్సన్ సామల పావని అచ్చం అలాంటి మనిషే. కాంట్రాక్టర్లు, లంచాలు వగైనా బాగోతాల గురించి ఆమె చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా  నుడివిన ముడుపుల పలుకులు అంత ఘనమైనవి మరి. పర్సెంటేజీలపై ఆమె చేసిన సత్యపూస భాష్యాలు, ఉపదేశాలు వింటే ఆ సత్యహరిశ్చంద్రుడు కూడా ‘సాహో.. సహోదరీ’ అంటూ ఆమె కాళ్లపై పడిపోవడం ఖాయం!

ఇలా పావని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఏం మాట్లాడిందో మీరే వింటే మళ్లీ కోర్టు తీర్పులకు ఇంటప్రెటేషన్ ఇచ్చినట్లు మేం చెప్పాల్సిన అవసరం లేదు. సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ సమావేశం శనివారం జరిగింది. తర్వాత విలేకర్ల సమావేశంలో పావని ‘లావాదేవీ’ల సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. మధ్యమధ్య కాస్త సిగ్గు గుమ్మరిస్తూ, నవ్వుతూ, మొహమాటం పడినా.. ‘వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కామన్..అంతే. కౌన్సిలర్లు కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకున్నారు. వర్కయినప్పుడు కనీసం వన్ టూ పర్సెంట్ ఇవ్వకపోతే ఎలా.. వార్డులో కొబ్బరికాయలు కొట్టి ఇన్నిపనులు చేస్తున్నాం.. అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్లకుండాలి..దాన్ని మళ్లా రాజకీయం చేసి.. అడుగుతున్నారు అనేది.. వాళ్ల విజ్జతకే వదిలేస్తున్నాను.. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే.. సిర్సిల్లలోనే కాదు రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో అయినా వన్ టూ పర్సెంట్ నడుస్తానే ఉంటదిగద’ అని చెప్పుకుంటూ పోయింది.

‘అయితే మీరు కూడా తీసుకుంటారా?’ అన విలేకర్లు అడగ్గా..

‘నేను కూడా కౌన్సిలర్నే కదా.. తీసుకుంటారా అంటే.. అందరితోపాటు నేను ఉంటాను….’ అని ఆమె గుండెనిండా నిజాయతీతో, మొక్కవోని ధైర్యంతో చెప్పేసింది.

అయితే తాను మాట్లాడుతున్నది చాలా సీరియస్ విషయమన్న స్పృహ లేకపోవడం, చుట్టూ మైకులు గుట్టలుగుట్టలుగా ఉండడంతో రెట్టించిన ఉత్సాహం ఆమెను కాస్తా వాగ్దేవికి అత్తలా మార్చేశాయి. కమీషన్లు, కాంట్రాక్టర్లు, మోరీలు, రోడ్లు వగైరా పదజాలమంతా నయాగరా జలపాతంలా దూకేసింది. ఆ దూకుడులో ఆమె మంత్రి పేరును కూడా దొర్లించేసింది.. ! అంతే రచ్చరచ్చ అయిపోయింది. ఊరంతా దుమారం రేగిపోయింది. దీంతో సదరు సామల పావని గట్టిగా లెంపకాయలు వేసింది. మరింత డ్యామేజీ జరగకుండా కొన్ని గంటల్లోనే తన పదవికి రాజీనామా సమర్పించేసింది. ‘వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయుచున్నాను..’ అని లేఖలో రాసేసింది!  ఈ తతంగమంతా వింటే ‘ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు’ అన్న సామెత ఊరికే రాలేదని మీకు అనిపించడం లేదా? ఇంకా.. నోటికి అదుపు, ఇంటికి పొదుపు, ఆడే కాలు, నోరే పాడు ఊరకే వుండవు.. ఇంకా.. ఇంకా..