Sirisha Catch the chain thief in hayath nagar
mictv telugu

కంట్లో కారం కొట్టి గొలుసు చోరీ.. వదలక వెంటబడి పట్టుకున్న మహిళ

August 5, 2022

హైదరాబాదులో ఓ మహిళ తాను చేసిన పనికి అందరిచేత శభాష్ అనిపించుకునేలా చేసింది. ఓ దొంగ కంట్లో కారం కొట్టి మెడలోని గొలుసు లాక్కొని పారిపోతుండగా, అలాగే కారం మంటతో వెంటబడి మరీ అతడిని పారిపోకుండా పట్టుకుంది. తన మూడు తులాల బంగారు గొలుసును కాపాడుకుంది. వివరాల్లోకెళితే.. సూర్యాపేటకు చెందిన నగేశ్, శిరీష దంపతులు హయత్ నగర్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వారి పక్కనే రెండు ఫ్లాట్లు ఖాళీగా ఉండడంతో ఇంటి ఓనరు టులెట్ బోర్డు తగిలించాడు. ఇంటి ఓనరు కొడుకు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండడంతో వారు అక్కడికెళ్లిపోగా, దీన్ని గమనించిన ఓ దొంగ శిరీష మెడలోని గొలుసు మీద కన్నేశాడు. గురువారం మధ్యాహ్నం శిరీష ఇంట్లో ఒంటరిగా ఉండగా, టులెట్ బోర్డు చూసి వచ్చానని నమ్మబలికాడు. ఓనరు ప్రస్తుతానికి లేడని వచ్చాక రమ్మని చెప్పినా, తాను ఓనరుతో ఫోన్‌లో మాట్లాడానని, ఒకసారి రూం చూపించాలని కోరాడు. దానికి శిరీష సరేనని రెండు రూంలు చూపించింది.

ఇదే అదనుగా భావించిన దొంగ.. వెంట తెచ్చుకున్న కారం పొడి తీసి శిరీష కంట్లో కొట్టి మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని కిందకు పరుగులు పెట్టాడు. ఈ హఠాత్పరిణామంతో షాకైన శిరీష ఆలస్యం చేయకుండా కారంతో కళ్లు మండుతున్నా ఓర్చుకుంటూ దొంగ వెంట పరిగెత్తింది. దొంగ కిందకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి పారిపోతుండగా, వెనకాల వచ్చి బైకుని గట్టిగా పట్టుకొని కేకలు వేసింది. దాంతో బెదిరిపోయిన దొంగ బైకుని ముందుకు పోనిచ్చి దాదాపు పది మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో కాళ్లకు గాయాలవుతున్నా శిరీష బైకుని వదలకపోవడంతో దొంగ బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు దొంగను పట్టుకొని దేహశుద్ది చేసి గొలుసు స్వాధీనం చేసుకొని శిరీషకు అప్పగించారు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి నిందితుడి నుంచి బైక్, కత్తితో పాటు చోరీ చేసిన తర్వాత మార్చుకునేందుకు తెచ్చుకున్న చొక్కాను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శిరీష చూపించిన తెగువను స్థానికులతో పాటు పోలీసులు కూడా అభినందించారు.