అమిత్ షాకు నోటీసులిచ్చేందుకు రెడీ అవుతున్న సిట్! - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షాకు నోటీసులిచ్చేందుకు రెడీ అవుతున్న సిట్!

November 24, 2022

తన కేబినెట్ మంత్రులపై ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడుతున్న కేంద్రాన్ని ఇరికించేందుకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహం పన్నుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా ఏకంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీలో నెం 2 అయిన అమిత్ షాను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఫాంహౌస్ కుట్రలో పట్టుబడిన ముగ్గురు నిందితుల కాల్ డేటాను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సిట్.. దానిని విశ్లేషించగా, అందులో అమిత్ షా ప్రస్తావన 20 సార్లు వచ్చినట్టు వెల్లడి కావడంతో కేంద్రంలోని బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు కేసీఆర్ రెడీ అయినట్టు నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.

దీని ద్వారా బీజేపీలో ఉన్న అవినీతి కోణాన్ని చూపించి దేశవ్యాప్త చర్చకు దారి తీయాలని, అంతేకాక బీజేపీ పడగొట్టిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల అపొజిషన్ నేతలతో కేసులు నమోదు చేయించాలని ప్రణాళిక రచిస్తున్నారు. తద్వారా బీజేపీని దోషిగా నిలబెట్టిన క్రెడిట్ ని తన సొంతం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కి లుకవుట్ నోటీసులు జారీ చేయగా, దర్యాప్తులో భాగంగా ఆర్ఎస్ఎస్ లో నెంబర్ 2 అయిన దత్తాత్రేయ హొస్బలే, అమిత్ షా ప్రైవేట్ కార్యదర్శి సాకేత్ కుమార్ లకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్టు వెల్లడవుతోంది. అయితే కేవలం కాల్ రికార్డులను పట్టుకొని కేంద్ర హోం మంత్రికి నోటీసులు జారీ చేస్తే కేసు నిలబడదని అంటున్నారు. అందుకోసం న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.