ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎప్పటినుంచో ప్లాన్ చేశారని, ఇందుకు సరైన ఆధారాలు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సంపాదించినట్లు మీడియా(నమస్తే తెలంగాణ పత్రిక)లో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు నిందితులు ఢిల్లీ కేంద్రంగా పక్కా ప్రణాళిక వేశారని తెలిసింది. నిందితుల మధ్య సంబంధాలను పూర్తి సాక్ష్యాలతో సహా సేకరించినట్టు సిట్ అధికారులు చెప్తున్నారు. వీటికి ఫోన్ల లొకేషన్లు, టవర్ సిగ్నల్స్ లాంటి సాంకేతిక ఆధారాలను సైతం జత చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి బుధవారం మీడియా వర్గాలు, వార్తా సంస్థల వద్ద కొన్ని పత్రాలు కనిపిండంతో కలకలం రేగింది.
40 రోజులూ ఇదే పని!
ఈ పత్రాలు పరిశీలిస్తే ఈ కేసులో ఏ1 రామచంద్ర భారతికి, ఏ4 బీఎల్ సంతోష్‌కు మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిద్దరు పలుమార్లు కలుసుకున్నారని, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ‘ఆపరేషన్ తెలంగాణ’ గురించి చర్చించుకున్నారని వారి సెల్ఫోన్లలోని డాటా ఆధారంగా తెలుస్తున్నదని సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలుపై వీరు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 26 వరకు నలభై రోజులపాటు వాట్సప్‌లో తరచూ చర్చించినట్టు సమాచారం. దీంతోపాటు ఈ కేసులో లొంగిపోయిన ముంజగల్ల విజయ్ అనేక విషయాలను సిట్‌కు వివరించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు వీడియో ఆధారాలను సైతం సిట్ జోడించినట్టు తెలుస్తున్నది.
ఈ ఏడాది ఆగస్టు 21న రామచంద్రభారతి, సింహయాజి, అడ్వకేట్లు ప్రతాప్, వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు కేసీ పాండే కలిసి ఢిల్లీలోని పాండే ఇంట్లో సమావేశమైనట్టు అడ్వకేట్ ప్రతాప్ సిట్‌కు వివరించాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 4న రామచంద్రభారతి, నందు, సింహయాజి, అడ్వకేట్ శ్రీనివాస్ ఢిల్లీలోని వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్లో మరోసారి సమావేశం అయ్యారని, వారందరి ఫోన్ల లొకేషన్ అక్కడే ఉండటమే ఇందుకు నిదర్శనమని ప్రతాప్ పేర్కొన్నట్టు సమాచారం.