Home > Featured > సిట్ చేతిలో ఆర్సీబీ-బీఎల్ సంతోష్‌ల వాట్సాప్ చాట్

సిట్ చేతిలో ఆర్సీబీ-బీఎల్ సంతోష్‌ల వాట్సాప్ చాట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో బీజేపీ ప్రముఖ నేత బీఎల్ సంతోష్ పాత్ర కచ్చితంగా ఉందని నమస్తే తెలంగాణ వార్తా పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి-బీఎల్ సంతోష్ మధ్య జరిగిన ఫోన్, వాట్సప్ సంభాషణలను సిట్ సేకరించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి పలు ఆధారాలను సిట్ అధికారులు కోర్టుకు అందచేసారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..ఏం జరిగిందనే దాని పైన ఫొటోలను కోర్టుకు సమర్పించింది. దీంతో, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పరిణమాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

ఆర్సీబీతో బీఎల్ సంతోష్‌ చాటింగ్

ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో బీఎల్ సంతోష్‌కు తెలిసే ఇదంతా జరిగిందనే అభిప్రాయానికి సిట్ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని రుజువు చేసే పక్కా ఆధారాలను ఇప్పటికే సిద్దం చేసుకుందని సమాచారం. సిట్ విచారణ ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి - బీఎల్ సంతోష్ మధ్య పలు సందర్భాల్లో చోటు చేసుకున్న ఫోన్ - వాట్సప్ సంభాషణలను సిట్ సేకరించింది. ఈ సంభాషణలో ‘ముగ్గురు వ్యక్తులను పరిచయం చేయాలని అనుకున్నాను.. అని ఆర్సీబీ మెసేజ్‌ పెట్టారు. క్షమించాలి, బిజీగా ఉన్నాను. కలవలేకపోయాను. నమ్మకమైన వ్యక్తి ఏకే సింగ్‌, మరో కీలకమైన వ్యక్తితో చర్చ చేయాల్సివున్నది.. అని బీఎల్‌ సంతోష్‌ రిప్లై ఇచ్చారు’ అని సిట్‌ హైకోర్టుకు తెలిపింది. కాల్‌డాటా, ఫొటోలు, ఇతర ఆధారాలూ ఉన్నాయని పేర్కొన్నది. బీఎల్‌ సంతోష్‌, ఆర్సీబీ మధ్య అనేకసార్లు ఫోన్‌ సంభాషణలు జరిగాయని తెలిపింది.

పక్కా ఆధారాలతో వీడియో, ఫోటోలు

అంతేకాకుండా.. సంతోష్‌తో రామచంద్ర భారతి హరిద్వార్‌లో భేటీ అయిన ఫొటోలను సంపాదించింది. అక్టోబరు 15న బీఎల్‌ సంతోష్‌ అధికారిక నివాసంలో ఉదయం 10 గంటలకు జరిగిన సమావేశంలో తుషార్‌ వళ్లెపల్లి, రామంద్ర భారతి, నందు, విజయ్‌ పాల్గొన్నట్లుగా ఆధారాలతో సహా సిట్ నిర్దారించినట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్‌ లొకేషన్లను సేకరించిన సిట్‌ సాంకేతికంగా బలమైన ఆధారం సేకరించింది. ఆ సమయంలో తీసిన వీడియో, ఫొటోలను కూడా సిట్‌ స్వాధీనం చేసుకుంది. సెప్టెంబరు 26న హైదరాబాద్‌లోని నందు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రామచంద్ర భారతి, సింహయాజి, న్యాయవాది పి. ప్రతాప్‌ ఆగస్టు 21న ఢిల్లీలోని వరల్డ్‌ బ్రాహ్మణ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కేసీ పాండే నివాసంలో సమావేశమైన విషయాన్ని న్యాయవాది ప్రతాప్‌ నిర్ధారించడంతోపాటు కీలక విషయాలు వెల్లడించారు. సెప్టెంబరు 4న మరోసారి రామచంద్ర భారతి, నందు, సింహయాజి, న్యాయవాది శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. సిట్ సేకరించిన వాట్సప్ ఛాటింగ్ ల ఆధారాల్లో పలు పేర్లు గుర్తించింది. ఈ కేసులో వారి ప్రమేయం ఎంత వరకు ఉందనే కోణంలో ఆరా తీస్తోంది.

Updated : 30 Nov 2022 10:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top