నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంతానం వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. శివచరణ్ రెడ్డి అనే యువకుడు.. ఎమ్మెల్యే మేకపాటే తన తండ్రి అంటూ మీడియా ముందుకు రావడం, తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప మరెవరూ వారసులు లేరంటూ ఎమ్మెల్యే ఆ వార్తలను కొట్టిపారేయడం.. ఆ రాష్ట్రంలో పలు చర్చలకు దారి తీసింది. తాజాగా ఈ విషయంపై ఆ యువకుడి తల్లి లక్ష్మీదేవి స్పందించారు. చంద్రశేఖర్ తనతో 18 ఏళ్లు కాపురం చేశారని, శివచరణ్ రెడ్డిని బాగా చూసుకునే వారని అన్నారు. ప్రస్తుతం ఆయనతో ఉన్న శాంతకుమారి పరిచయం కావడంతోనే ఇంటికి రావడం తగ్గించారని, విషయం తెలిసి మందలించాక పూర్తిగా రావడం మానేశారని అన్నారు.
తనకు 15 ఏళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లయిందని చెప్పారు లక్ష్మీ దేవి. అయితే ఇష్టం లేక రెండేళ్లకే కొండారెడ్డి వదిలేసి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. దీంతో తాను తన పిన్ని ఇంటికి వచ్చానన్నారు. ఓ రోజు తన మామ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుకుంటుండగా తన విషయం చర్చకు వచ్చిందని, తన గురించి చంద్రశేఖర్‌రెడ్డికి చెబుతూ తన మామ బాధపడ్డారని అన్నారు. ఇక, అప్పటి నుంచి చంద్రశేఖరరెడ్డి తనను ఇంటికి తీసుకెళ్తానని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లపాటు తన ఇంటి చుట్టూ తిరిగాడని అన్నారు.
ఆ తర్వాత చంద్రశేఖరరెడ్డి తనను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టాడని, కుమారుడు శివచరణ్‌రెడ్డిని చక్కగా చూసుకునే వారని లక్ష్మీదేవి గుర్తు చేసుకున్నారు. ఆయనకు శాంతకుమారి పరిచయమైనప్పటి నుంచి తమను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు. ఇప్పుడేమో డబ్బుల కోసం అబద్ధాలు ఆడుతున్నామని అంటున్నారని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.