ఆడవేషం నిరసనా? శివప్రసాద్.. నీకు బుర్ర తిరుగుతోందా?    - MicTv.in - Telugu News
mictv telugu

ఆడవేషం నిరసనా? శివప్రసాద్.. నీకు బుర్ర తిరుగుతోందా?   

March 19, 2018

‘ఆడంగి వేషాలు.. నేనేమన్నా చేతులకు గాజులు వేసుకున్నానా.. మగాడు తిరగక చెడతాడు, ఆడది తిరిగి చెడుతుంది.. ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు. ఆడదానిగా పుట్టేకంటే అడవిలో మానై పుట్టడం మేలు.. ఆడపిల్ల ఆడపిల్లేగాని ఈడపిల్లగాదు, ఆడదానికి చదువులు ఎందుకు?.. ’ ఇంకా చాలా ఉన్నాయి. ‘మగపిల్లాడు పుడితే అత్త వద్దంటుందా?’ వంటివి ‘తెలివిమీరిన’ భావదరిద్రపు సూక్తులూ ఉన్నాయి. ఆడవాళ్లపై వివక్షకు, దాష్టీకానికి, అత్యాచారాలకు, దాడులకు ఇలాంటి మూర్ఖత్వపు మాటలు చేష్టలు కూడా కారణాలు. అంతేకాకుండా మహిళల కట్టుబొట్లపైనా తీవ్రమైన ఆంక్షల కొరడాలు ఝళిపించే దేశం మనది. ఈ వివక్షకు టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు సాక్షిగా తన ఆడవేషంతో మరింత ఆజ్యం పోషి ఆడవేషం కట్టాడు.

ఎంపీనే ఇలా..

శివప్రసాద్ బాధ్యతగల ఎంపీ. పార్లమెంటు ఆవరణలో ఆయన ఎన్నో వేషాలు వేశాడు. మాంత్రికుడు, పోతురాజు, కాటికాపరి, కృష్ణుడు మరెన్నో వేషభాషల్లో తన డిమాండ్లేమిటో వినిపించాడు. ఆ వేషాలపై పెద్దగా అభ్యంతరం చెప్పడానికేమీ లేదు. అందరూ వేస్తున్న వేషాలే. అయితే ఈ రోజు ఆయన వేషన ‘ఆడవేషం’ మాత్రం చర్చనీయాంశం. మోదీ విధానాలపై విమర్శలు, ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న ఆయన డిమాండ్ సరైనవే. తెలుగువాళ్లుగాని, మరో రాష్ట్రం వాళ్లుగాని అందుకు అభ్యంతరం చెప్పాల్సిందేమీలేదు. కానీ తన నిరసనకు ఆయన ఎంచుకుకున్న ఆడరూపం మాత్రం తీవ్ర అభ్యంతరకరం. మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ మరెన్నో హక్కులు కల్పించింది రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పార్లమెంటు  వద్ద ఆడవేషాన్ని ఒక ‘నిరసన’ రూపంగా ధరించి హల్ చల్ చేయడం మొత్తం మహిళాజాతినే కించపరడం కిందకి వస్తుంది. మహిళ ఎప్పుడూ ప్రేమకు, శుభానికి, సుఖసంతోషాలకు ప్రతీకనేగాని నిరసనకు కాదు. దేశదేశాల చరిత్రలు, నాగరికతలు దీన్ని రుజువు చేస్తున్నాయి. మహిళల సమస్యలను వివరించడానికే తాను ఆడవేషం కట్టానని శివప్రసాద్ చెప్పుకోవచ్చు. కానీ ఆయన వేషంలో, మాటల్లో సమస్యల ప్రస్తావనకంటే ఎగతాళి, జుగుప్స కలింగే ఎలిమెంట్లే ఎక్కువ ఉన్నాయి. ఆయన మంగళసూత్రం, హిందూ స్త్రీలకు ఆభరణాలంటే ఎక్కువ మక్కువ అని, ఆంధ్రప్రదేశ్ మహిళలు జాడించి కొడితే మోదీ అడ్రస్ లేకుండా పడిపోయేవాడని ఏమేమో అన్నాడు.

ఎవరినీ కించపరచకూడదు..

ఎన్. శివప్రసాద్ వేషాలు వేయడంలో దిట్టే. కాదని ఎవరూ అనరు. అయితే ఈ దేశంలో కులమతాల మాదిరే వేషాలకు కూడా వివక్ష ఉంది. పీడన ఉంది. దోపిడీ ఉంది. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా.. అన్ని నోటితోనే.. ఎవరిమీదైనా కోపమొస్తే.. వారి అమ్మలు, అక్కలను సంస్కృతంలో దీవించే గొప్పనోళ్లు మనవి! కించపరచడానికి, వేధించడానికి, బలిపశువులను చేయడానికి ఆడవాళ్లనే టార్గెట్ చేసుకునే ఈ సమాజంలో ‘శివప్రసాదమ్మ’ ఏ సందేశం ఇస్తోంది? ఒక్క ఆడవేషమే కాదు, సమాజంలో అణగారిన ఏ వర్గాల వారినీ కించపరిచేలా చూపకూడదు. లేకపోతే శివప్రదసాద్‌లా జనం చేతిలో నానా తిట్టూ తినడం ఖాయం.. అవేంటో ఇక్కడ చెబితే మరో వార్త రాసుకోవాల్సి వస్తుంది. అయినా మచ్చుకు రెండు..  ‘బఫూన్ గాడు.. శివప్రసాద్ ఇంతవరకు మగవాడని అనుకున్నామే.. అయ్యో ఆయన ఇంత సుందరాంగా? ఎవరు ఈ పచ్చపరమసాధ్వీ శిరోమణీ..’