6 కాదు 18 అడుగుల దూరం పాటించండి..
కంటికి కనిపించని మహమ్మారి కరోనా రాకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించడమే ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న అస్త్రం. ఇలా చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించ వచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ప్రతి మనిషి కనీసం 6 అడుగల దూరం పాటించాలని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ దూరం కూడా సరిపోదని పరిశోధకులు తేల్చారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా 18 అడుగుల దూరం పాటించాల్సిందేనని తేల్చి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోందని ప్రతి మనిషి ఎక్కువ దూరం పాటించాల్సిందేనని పేర్కొన్నారు.
నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యాయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి, చిన్నగా దగ్గితే, ఆ సమయంలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నా, ఐదు సెకన్ల వ్యవధిలోనే వైరస్ 18 అడుగుల దూరం వరకూ వెళ్లిపోతుందని గుర్తించారు. దీంతో చిన్న పిల్లలు, తక్కువ ఎత్తు ఉన్న వారికి సులువుగా సోకుతుందని చెప్పారు. అందువల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలు పాటిస్తున్న అడుగు దూరం, ఆరు అడుగుల దూరం ఏ మాత్రం సరిపోదని చెబుతున్నారు. వేర్వేరు వాతావరణ పరిస్థితులను బట్టి ఇది మారే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఏమైనా ముందు జాగ్రత్తగా 18 అడుగుల దూరం ఉండటమే ఉత్తమమని పేర్కొంటున్నారు.