ఇల్లు కూలింది.. బతుకులు రోడ్డున పడ్డాయి - MicTv.in - Telugu News
mictv telugu

ఇల్లు కూలింది.. బతుకులు రోడ్డున పడ్డాయి

October 18, 2020

మరోమారు తెలుగు రాష్ట్రాలను వానలు వణికిస్తున్నాయి. ఇప్పటికే తొలుత కురిసిన భారీ వర్షానికి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ వానలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వీధులన్నీ సెలయేళ్లలా పొంగి పొర్లుతున్నాయి. బాబానగర్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లను ముంచెత్తుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిన్న ఓల్డ్ మలక్‌పేట్‌లో శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్ మీద నడుచుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని మృత్యువాత పడ్డాడు. మరోపక్క మంగళ్‌హాట్ టర్కీపేటలో ఇల్లు కూలిపోయి ఆరేళ్ల చిన్నారి జుబేదా మృతిచెందింది. ఎన్నో వాహనాలు వరదలకు కొట్టుకుపోతున్నాయి. అక్కడక్కడా మొసళ్లు, తాచు పాములు, కొండ చిలువలు వరదలకు ఇళ్లల్లోకి కొట్టుకువస్తున్నాయి. 

తాజాగా ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితిలో భారీ వర్షాలకు శుక్ర, శనివారాల్లో ఆరు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. పొట్టంగిలో కుమార వీధిలో పూజారి కొండమ్మ అనే వృద్ధురాలి ఇంటి గోడలు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలిపోయాయి. చొడిగాంకు చెందిన నందాయి దిసారికి చెందిన ఇల్లు శనివారం ఉదయం కూలిపోయింది. పొట్టంగి పంచాయతీలోని బదిలిగూడ గ్రామంలో సొమరా, జగ్గా అనే ఇద్దరి  ఇళ్లు నేలకొరిగాయి. పార్జాశివురు గ్రామంలో మరో రెండు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో బాధితులు ధీనంగా రోదిస్తున్నారు. వారు నిరుపేదలు కావడంతో ధ్వంసమైన నివాసాల్లోనే తలదాచుకుంటున్నారు. కాగా, శనివారం రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్లి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగానికి నివేదికలు పంపారు.