రైళ్లను మా రాష్ట్రంలో ఆపొద్దు ప్లీజ్.. కేంద్రానికి సీఎం లేఖ - Telugu News - Mic tv
mictv telugu

రైళ్లను మా రాష్ట్రంలో ఆపొద్దు ప్లీజ్.. కేంద్రానికి సీఎం లేఖ

May 15, 2020

gnfgn

కొన్ని రోజులుగా వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు రైళ్లలో వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తమ రాష్ట్రంలో రైళ్లను ఆపొద్దని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. న్యూఢిల్లీ నుంచి తిరునవంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలును తమ రాష్ట్రంలోని మడగావ్‌ స్టేషన్‌లో ఆపొద్దని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. 

మడగావ్‌లో రైలు దిగేందుకు దాదాపు 720 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం ఉందనీ.. అయితే వారిలో తమ రాష్ట్రానికి చెందినవాళ్లు ఉన్నారా అన్న విషయంలో స్పష్టత లేదని లేఖలో పేర్కొన్నారు. ‘స్టేషన్‌లో దిగిన తర్వాత వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారు నిబంధనలు పాటిస్తారని కచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ స్టేషన్‌లో రైలు ఆపొద్దని రైల్వే శాఖకు సూచించాం’ అని గోవా సీం సావంత్ వెల్లడించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో బీచ్‌లు ఇతరత్రా చోట్లకు వెళ్లకూడదని ఆయన ఆంక్షలు విధించారు. కాగా, దాదాపు నెల రోజుల నుంచి గోవాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతున్నాయి. దీంతో గురువారం నాటికి ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి.