ఎయిర్‌పోర్టులో చెంపలు పగలగొట్టుకున్నారు... - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌పోర్టులో చెంపలు పగలగొట్టుకున్నారు…

November 28, 2017

ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకోకపోతే అంతే. ఎక్కడున్నా చెంపలు వాచిపోతాయి.. వాయించుకున్న వాళ్లకు కూడా ఎమోషన్స్ ఉంటే.. తిరిగి చడామడా  వాయించేస్తారు. ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ఇదే జరిగింది. ఒక ప్రయాణికురాలు, ఎయిరిండియా ఉద్యోగిని పరస్పరం చెంప దెబ్బలు కొట్టుకున్నారు..

ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఒక ప్రయాణికురాలు ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చింది. దీంతో ఆమెను తనిఖీ చేసి, విమానం ఎక్కించడానికి ఎయిరిండియా సిబ్బంది నిరాకరించారు. దగ్గర్లోని మహిళా ఉద్యోగి దగ్గరికెళ్లి మాట్లాడాలని సూచించారు. ప్రయాణికురాలు ఆ ఉద్యోగినికి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకుంది. మాటామాటా పెరిగింది.

ప్రయాణికురాలు ఆవేశం పెట్టలేక ఆ ఉద్యోగిని చెంప పగలగొట్టింది. ఆమె కూడా కూడా వెనక్కి తగ్గకుండా మరింత బలంగా ప్రయాణికురాలి చెంప వాయించింది. గొడవ ముదరడంతో సిబ్బంది జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయినా ప్రయాణికురాలు పోలీసుల వద్దకు వెళ్లింది. చివరికి వారు సర్ది చెప్పడంతో  మహిళలు ఇద్దరూ రాజీ పడ్డారు.