భారతీయ చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచ ప్రఖ్యాతం. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలను నేసిన ఘనత మన కళాకారులది. అందుకే బ్రిటిష్ వారు వారి మిల్లు బట్టలను అమ్ముకోవడానికి మన చేనేత పరిశ్రమను సర్వనాశనం చేశారు. చేనేత కార్మికులను చిత్రహింసలు పెట్టారు. వేళ్లు నరికారు. కానీ ఇప్పుడు కూడా నేతలో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్న కళకారులు మన దేశంలో ఉన్నారు. నేత పరిశ్రమకు పేరొందిన సిరిసిల్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల చీరలకే కాదు, కనీవినీ ఎరుగని వస్త్రాలకు కూడా అది ప్రసిద్ధం. తాజాగా ఓ చేనేత కార్మికులు వెండితో చీర నేసి వార్తల్లోకి ఎక్కారు. వెండి చీరలు గతంలోనూ ఉన్నా కేవలం 90 గ్రాముల వెండితో సువాసనలు వెదజల్లుతూ ధగధగలాడే చీర నేయడం ఆయన ప్రత్యేకత. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ నేసిన ఈ చీర బరువు 600 గ్రాములు. ఐదున్నర మీటర్ల 48 ఇంచుల పన్నాతో నేసిన ఈ చీర కోసం రూ.45 వేలు ఖర్చయింది. ఇందులో 27 రకాల సువాసలు నింపాడు. నెల రోజులు కష్టపడ్డాడు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తన తల్లి కోసం వెండి దారాలతో సిరిచందనం చీర కావాలని కోరారని విజయ్ చెప్పారు.