నినాదాల భారతం.. ! - MicTv.in - Telugu News
mictv telugu

నినాదాల భారతం.. !

August 19, 2017

సుంకన్న బొంకరా అంటే మావూరి మిరియాలు మామిడికాయంత అన్నడట. అట్లనే ఉంది మన నాయకుల డైలాగుల శైలి. 70 ఏండ్ల నుండి కుడిఎడమలుగా డైలాగుల్ని అందంగా చెప్తున్నారు. రూపం అదే సారమూ అదే. అయితే పలికే గొంతులు వేరు, వాటి పదనిసలు వేరు. భజనపరుల సరిగమపదనిసలు కాస్త అటూ ఇటుగా అంతా ఒక్కటే.

విషయం ఏందంటే..  మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత్ మారాలన్నారు నెహ్రూ. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వచ్చి.. జై జవాన్, జై కిసాన్ అని నడిమధ్యనే ఎళ్లిపోయిండు.  ఆ తర్వాత వచ్చిన మార్పును.. మార్చుకుంటూ వచ్చారు. జనాలు నేతలను మారుస్తూపోయారు. అందరి సూత్రం, అందరి పాట, బాట అదే.. అట్లాగే ఉంది.

ఇందిరా గాంధీ గరీబీ హఠావో అన్నారు.  ఆమె కొడుకు రాజీవ్ గాంధీ కూడా ఇదే పల్లవి అందుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఈ డైలాగులు బాగానే పేలాయి. జనం చప్పట్లు కొట్టారు. ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిర అన్నారు. ఇప్పటి గరీబి.. బికారీ కొంచెం మారినట్లు అన్పించినా.. ఏటా కోట్ల మంది జనం గరీబోళ్ల జాబతాల కలుస్తనే ఉన్నరు. 1960లో ఉన్న ఇండియా, 1980 నావికి  కాస్త మారింది. కానీ జన జీవితం అట్లనే ఉన్నది. రాజకీయ తాయిలాలు మాత్రం మారాయి. జనాలను ఆకట్టుకొనే జనరంజన్ డైలాగులు పేలాయి.

ఇందంతా పాత సారాను ,పాత సీసాలో  నింపడమే. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పే బీజేపీ హయాంలో.. వాజ్ పేయి ప్రధానిగా ఉండగా భారత్ వెలిగిపోతోందని ప్రచారం చేశారు. కానీ, అప్పటికే దేశంలో రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 30 శాతం మందికి మంచి తిండి, నీళ్ల సౌకర్యమే లేదు.

ఆ తర్వాత యూపీఏ తొలి, మలి హయాంలలోనూ నినాదాలు పేలాయిగాని ప్రజల బతుకులు మాత్రం మారలేదు. మళ్లీ మోడీ రూపంలో ఊపిరి పోసి  కమలాన్ని పవర్ లోకి తెచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో కొత్త  కొత్త నినాదాలత్ పాలన సాగిస్తున్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటున్నడు కాని, వికాస్ కొంతమందికే పరిమితమైతోందన్న నిజాన్ని మాత్రం పట్టించుకుంట లేడు.

మార్పు, అచ్చేదిన్, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్, ఇప్పుడు.. నవభారత్ నిర్మాణం అంటున్నారు. తాజాగా వెల్లడైన ఆర్ బిఐ సర్వే ప్రకారం చూసినా తమ జీవితాల్లో మార్పు లేదని మెజార్టీ ఇండియా భావిస్తున్నదట.

మరి మార్పు ఎక్కడున్నట్లు? నాయకుల మాటల్లో తప్ప. ఇంకా నయం మూస నినాదాలు కాకుండా  ఈ మాత్రం డైలాగులైనా మార్చి చెప్తునందుకు ఆనందించాలంటారేమో.