కామారెడ్డి తండాకొచ్చి మనుషుల చేతుల్లో చచ్చిపోయిన ఎలుగు  - MicTv.in - Telugu News
mictv telugu

కామారెడ్డి తండాకొచ్చి మనుషుల చేతుల్లో చచ్చిపోయిన ఎలుగు 

May 23, 2020

gnmvghnj

అడవుల నుంచి తండాకు వచ్చిన ఓ ఎలుగుబంటి తండావాసుల్ని తెగ టెన్షన్ పెట్టింది. దానిని చూసిన జనాలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. చివరికి అందరూ కలిసి దానిని అంతమొందించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి తండాలోకి రావడం రావడమే స్థానికుడైన బాలరాజు అనే వ్యక్తిపై దాడి చేసింది. దానిని చూసి తండావాసులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎలుగుబంటిని వెంబడించారు. జనాల్ని చూసి భయపడిన ఎలుగు పక్కనే ఉన్న ఓ బాత్రూంలోకి చొరబడింది. అందరూ కలిసి కర్రలు తీసుకువచ్చి అది బయటకు రాకుండా బాత్రూంకు కర్రలను అడ్డుగా పెట్టారు.

వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే అది మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. బాత్రూమ్ తలుపులు ధ్వంసం చేసుకుని నర్సింహులు అనే వ్యక్తిపై దాడి చేసింది. దీంతో స్థానికులు ఉగ్రరూపం చూపించారు. కర్రలు ,రాళ్లతో ఎలుగుబంటిని వెంబడిస్తూ దాడి చేశారు. దీంతో ఎలుగుకు తీవ్ర గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఎలుగు దాడిలో గాయపడిన స్థానికుల్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. ఇంకా అడవిలో దాని తాలూకు ఎలుగులు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిని వెతికి పట్టుకోవాలని కోరుతున్నారు.