రోజుకు 150 సార్లు.. 7 గంటలు అదే పని.. - MicTv.in - Telugu News
mictv telugu

రోజుకు 150 సార్లు.. 7 గంటలు అదే పని..

April 17, 2018

స్మార్ట్ ఫోన్లు చేతికొచ్చాక కాలేజీ విద్యార్థులకు అదే లోకమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకుని నిద్రపోయేదాకా అదే సర్వస్వమైపోతోంది. ఫోన్ బానిసత్వంపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మనదేశంలో సగటు కాలేజీ విద్యార్థి రోజుకు 150 సార్లు ఫోన్ చూస్తున్నాడు. 4 నుంచి 7 గంటల వరకు సమయాన్ని దానికే తగలేస్తున్నాడు.

ఫోన్ కాల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, గూగుల్, సినిమాల్లో కాలం గడిపేస్తున్నారు. పెద్దమొత్తంలో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వ్యసనంపై యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఇలాంటి దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి.

స్మార్ట్ ఫోన్‌ను 74 శాతం మంది కాల్స్ చేసుకోవడానికి కాకుండా వీడియోలు, ఇతరత్రా వాటికోసం వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 63 శాతం మంది రోజుకు 4 నుంచి 7 గంటల సమయాన్ని ఫోన్ చూసుకుంటూనే గడిపేస్తున్నారు. 23 శాతమంది 8 గంటలు అదే పనిపై ఉన్నారు. చాలామంది ఫోన్ వ్యవసనంగా  మారిపోయిందని, అదిలేకపోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని తేలిసింది. ఈ వ్యసనం వల్ల మానసిక సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. టీనేజ్ పిల్లలకు రోజుకు రెండుగంటలకు మించి ఫోన్ అందుబాటులో వుండకుండా చూడాలని తల్లదండ్రులను కోరుతున్నారు