Smart phone for Rs. 101..! People flocked to the showroom
mictv telugu

ఓపెనింగ్ ఆఫర్.. రూ.101 లకే స్మార్ట్ ఫోన్.. క్షణాల్లో సేల్

July 15, 2022

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువుగా మారింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు, గృహిణులు..ఇలా ప్రతీ ఒక్కరికి స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని నడవట్లేదు. ఆన్ లైన్ క్లాసుల కోసమో, సోషల్ మీడియా బిజినెస్ కోసమో స్మార్ట్ ఫోన్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామాలలో ఉండే వారు కూడా వారి స్థోమతను బట్టి కనీసం రూ.5 వేలలో ఉండే ఫోన్ ను వాడుతున్నారు. అయితే కేవలం రూ.101 కే స్మార్ట్ ఫోన్ విక్రయిస్తామని ప్రకటించింది ఓ సెల్ ఫోన్ షాపు యాజమాన్యం. కొత్త షాపు ప్రారంభం సందర్భంగా ఈ ఆఫర్ పెట్టింది. ఇంకేముంది.. జనాలు ఎగబడ్డారు. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ వస్తుందని తెలిసి షాపు ముందు కస్టమర్లు క్యూ కట్టారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

కోయంబత్తూరులోని గాంధీపురం 9వ వీధిలో కొత్తగా సెల్‌ఫోన్‌ షాపు ప్రారంభించారు. ఈ షాపులో పిక్సెల్ కమ్యూనికేషన్, ఇంతకుముందే వాడిన సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్‌లను విక్రయిస్తుంటారు. ఈ షాపు ప్రారంభోత్సవ ఆఫర్‌గా రూ.3,000కి ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను కేవలం రూ.101లకే అమ్ముతామని ప్రకటించారు. కొనుగోలు చేసేవారు ఆ ధరను చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన ఆ జిల్లా అంతా వ్యాపించడంతో.. రూ. 101 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌ను లభిస్తుంది కదా అని.. కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి దుకాణం ముందు జనం గుమిగూడారు. కోయంబత్తూరు నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ దుకాణంలో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. దీంతో షాపుకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది.