వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే ఇలా చేయండి.. - MicTv.in - Telugu News
mictv telugu

వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే ఇలా చేయండి..

May 9, 2022

రాష్ట్రంలో ఎండలు దంచుతున్న వేళ జనమంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులతో పాటు పిల్లలు, పెద్దలు చాలామంది ఇళ్లల్లోనే సేదతీరుతున్నారు. ఫలితంగా ఫ్యాన్‌లు, ఫ్రిజ్‌లు, ఏసీల వాడకం కూడా ఎక్కువైంది. మరోవైపు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగిన క్రమంలో బిల్లు చూస్తేనే షాక్ కొడుతున్న పరిస్థితి. యూనిట్లు పెరిగితే శ్లాబు రేటు మారుతుంది. శ్లాబ్ మారిందంటే కరెంటు బిల్లు మోత మోగిపోతుంది. అందుకే క్రమపద్ధతిలో విద్యుత్ వినియోగిస్తే అధిక బిల్లులను నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ పాటిస్తే మీ ఇళ్లల్లో కరెంట్‌ను ఆదా చేస్తూ.. వచ్చే బిల్లును తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..

• ఏసీ టెంపరేచర్‌ను 24 డిగ్రీల కంటే తగ్గించకండి. అంతకంటే తగ్గిస్తే కరెంట్ బిల్లు పెరగడం తప్పా, పెద్దగా ఫలితం ఉండదు. విద్యుత్ ఆదా చేయాలంటే 24 నుంచి 26 డిగ్రీల వద్ద ఏసీ ఆన్ చేసినట్లయితే రూమ్ టెంపరేచర్ తగ్గడమే కాకుండా.. ఏసీ మన్నికను కూడా పెంచుతుంది.

• LED బల్బులను ఎక్కువగా ఉపయోగిస్తే కరెంట్ ను ఆదా చేయవచ్చు. గది నుండి బయటకు వెళ్లేటప్పుడు ఫ్యాన్లు, కూలర్, ఏసీతో సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తప్పక స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కూడా కరెంట్ ఆదా అవుతందనే విషయాన్ని గమనించాలి

• టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ వంటి వాటిని ఉపయోగించకుంటే, దాన్ని అన్‌ప్లగ్ చేయడం ఉత్తమం. దాని వల్ల నెలకు విద్యుత్ బిల్లులో 10% వరకు ఆదా చేయవచ్చు. టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ మరియు మొబైల్ ఛార్జర్‌లు స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ విద్యుత్ వినియోగిస్తూనే ఉంటాయి. కాబట్టి ఉపయోగంలో లేనప్పుడు వాటిని అన్‌ప్లగ్ చేయాలి.

• పాత ఎలక్ట్రానిక్ వస్తువులు పవర్‌ను ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాయి. కాబట్టి వాటి స్థానంలో స్మార్ట్ పరికరాలను ఉపయోగించండి. అవి విద్యుత్ బిల్లును తగ్గిస్తాయి. తద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనం పొందవచ్చు.

• ఇంట్లో వాడే ఫ్రిజ్‌ పాతదైతే నెలకు 160 యూనిట్లకు పైగానే కరెంటు కాలుతుంది. అదే స్మార్ట్‌ ఫ్రిజ్‌ అయితే అవసరమైనప్పుడే ఆన్‌ అవుతాయి. లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల కరెంటు బిల్లు రూ.300 వరకు తగ్గే ఛాన్సుంది. రిఫ్రిజిరేటర్‌ను క్రమ పద్ధతిలో పూర్తిగా శుభ్రం చేయాలి మరియు డోర్‌ని ఎల్లప్పుడూ సరిగ్గా మూసి ఉంచాలి. అలాగే, వెదర్ కండిషన్ బట్టి కూలింగ్ బటన్‌ను సెట్ చేయాలి.
ఇలాంటి టిప్స్ పాటిస్తే ఈ సమ్మర్ కూల్‌గా గడిచిపోతుంది.