ఏజెంట్ స్మిత్..స్మార్ట్ ఫోన్‌లకు కొత్త వైరస్  - MicTv.in - Telugu News
mictv telugu

ఏజెంట్ స్మిత్..స్మార్ట్ ఫోన్‌లకు కొత్త వైరస్ 

July 11, 2019

Agent Smith virus hides in WhatsApp

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను మరో వైరస్ భయపెడుతోంది. ఏజెంట్ స్మిత్ పేరుతో ఓ వైరస్ స్మార్ట్‌ఫోన్లపై దాడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు  ఈ వైరస్ సోకింది. ఇందులో 1.5 కోట్ల స్మార్ట్‌ఫోన్లు ఇండియాలోనే ఉండటం గమనార్హం. ఏజెంట్ స్మిత్ మొబైల్ వైరస్ ఫోన్‌లో చేరిన విషయం స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు కూడా తెలియదు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ఈ విషయాన్ని తెలిపింది. ఏజెంట్ స్మిత్ వైరస్ హిందీ, ఇండోనేసియన్, అరబిక్, రష్యన్ భాషలు మాట్లాడే వినియోగదారులను టార్గెట్ చేసింది. ఇండియా తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. 

ఈ వైరస్ ప్రధానంగా 9Apps అనే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని చెక్ పాయింట్ సంస్థ తెలిపింది. ఈ వైరస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుని నుంచి డేటాను దొంగిలించదు. కానీ, ఫోన్‌లోని యాప్స్‌ను హ్యాక్ చేసి ప్రకటనలు డిస్‌ప్లే అయ్యేలా చేస్తుంది. దీంతో వచ్చే వ్యూస్‌ వల్ల వైరస్ ఆపరేటర్‌కు లాభం చేకూరుతుంది. ఇకపోతే మాల్వేర్.. బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలను దొంగిలించే అవకాశం కూడా ఉందని చెక్ పాయింట్ తెలిపింది. కొత్త మాల్వేర్ వెలుగులోకి రావడంతో యూజర్లు కేవలం నమ్మకమైన యాప్ స్టోర్స్ నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెక్ పాయింట్ సంస్థ సూచిస్తుంది. ఈ అంశమై గూగుల్‌ను సంప్రదించామని, హానికర యాప్స్‌ ఏవీ ప్లే స్టోర్‌లో మిగిలి లేవని పేర్కొన్నారు.