ప్రభుత్వ ఆఫీసులకు పనిమీద వెళ్తే వాళ్లు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారో మనలో చాలా మందికి అనుభవమే. చాలా సేపు వెయిట్ చేయించడంతో పాటు ఏదో స్వంత సొమ్ము దానమడిగినట్టు కసురుతారు. ఇదే సమస్య ఫిలిప్పీన్స్లోని ములానే నగరంలో వచ్చింది. దాంతో ఆ నగర మేయర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవలే మేయర్గా ఎన్నికైన అరిస్టాటిల్ అగ్విరే ఈ సమస్యకు పరిష్కారంగా ‘స్మైల్ పాలసీ’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రజలెవరైనా సమస్యలు చెప్పుకోవడానికి, పన్నులు కట్టడానికి ఆఫీసులకు వస్తే వారిని ఉద్యోగులు నవ్వుతూ పలకరించాలి. చాలా దూరం నుంచి ప్రజలు వస్తారు కాబట్టి వారి పట్ల దయతో, మర్యాదగా ప్రవర్తించాలి. లేదంటే వారికి 6 నెలల జీతం కట్ చేస్తారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ..‘అధికారుల తీరుపై స్థానిక మత్స్యకారులు, కొబ్బరి తోటల యజమానులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. చాలా చికాకుగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం. అందుకే ఇలాంటి చట్టం తీసుకొచ్చా’నని వెల్లడించారు. ఇలాంటి చట్టం మన దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. మీ అభిప్రాయాన్ని కామెంటు రూపంలో మాకు తెలియజేయండి.