ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా ఆసక్తికర విషయాలు చాలా వెలుగులోకి వచ్చాయి. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ని ముంబై కొనుగోలు చేయగా, మెన్స్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబైకి ఆడుతున్న విషయాన్ని అభిమానులు హైలెట్ చేస్తున్నారు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే ఇద్దరు కెప్టెన్లు ఒకే ఫ్రాంచైజీకి ఆడడం అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. అటు 18వ నెంబర్ జెర్సీతో ఆడే కోహ్లీ, స్మృతి మంధనలు ఆర్సీబీకి ఆడుతుండడం మరో విశేషంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ప్లేయర్లకు వేలంలో పలికిన ధరలు మాత్రం రికార్డుగా చెప్తున్నారు. ఈ క్రమంలో స్మృతి మంధనను రూ. 3.4 కోట్లకు ఆర్సీబీ దర్కించుకుంది.
దీంతో స్మృతి పాక్ కెప్టెన్ బాబర్‌ని మించిపోయిందని గణాంకాలతో సహా వెల్లడిస్తున్నారు. మనదగ్గర ఐపీఎల్ తరహాలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ సూపర్ లీగ్ అనే పేరుతో టోర్నీ నిర్వహించింది. ఇందులో ప్లాటినం అనే కేటగిరీలో బాబర్ ఒక్కడే ఉండగా, అతనికి పాక్ కరెన్సీలో రూ. 3.6 కోట్ల డబ్బు అందుతుంది. అయితే దాన్ని భారత కరెన్సీతో పోల్చి చూస్తే ఆ మొత్తం ఇండియాలో ఒక కోటి 23 లక్షలుగా ఉంటుంది. ఈ లెక్కన బాబర్‌తో పోలిస్తే స్మృతి మంధననే రెండున్నర రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఉమెన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకుంటోందని అభిమానులు వెల్లడిస్తున్నారు. ఇది ఇండియన్ క్రికెట్ సత్తా.. స్మృతి మంధన రేంజ్ ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.