ఐపీఎల్ తరహాలో ఐదు జట్లతో తొలిసారిగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సోమవారం ముంబైలో ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధనకు భారీ ధర దక్కింది. రూ.3 కోట్ల 40 లక్షలు వెచ్చించి ఆర్సీబీ మంధనను దక్కించుకుంది. ఈమె ప్రారంభ ధర రూ. 50 లక్షలే ఉన్నా ముంబైతో తీవ్రంగా పోటీపడి ఆర్సీబీ సొంతం చేసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ని ముంబై ఇండియన్స్ రూ. 1 కోటి 80 లక్షలకు దక్కించుకుంది. విదేశీ మహిళా క్రికెటర్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ రూ. 3 కోట్ల 20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఎలిస్ పెర్రీని రూ. 1.7 కోట్లకు ఆర్సీబీ, సోఫీ ఎకెల్ స్టోన్ రూ. 1.8 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ టోర్నీ కోసం మొత్తం 1525 మంది ప్లేయర్లు నమోదు చేసుకోగా వీరిలో 409 మంది మాత్రమే వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో భారతీయులు 246 మంది, విదేశీయిలు 163 మంది ఉన్నారు. విదేశీయుల్లో 8 మంది అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇక మొత్తం 409 మందిలో తమ దేశాల తరపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన వారు 202 మంది ఉంటే అలా చేయని ారు 199 మంది ఉన్నారు. సీనియర్ జూనియర్ విషయానికి వస్తే ముగ్గురు ప్లేయర్లు 15 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉన్నారు. భారత వెటరన్ ప్లేయర్ లతిక కుమారి 41 ఏళ్లతో టోర్నీలో అత్యంత పెద్ద వయసు ప్లేయర్‌గా నిలిచారు. ఆమె తర్వాత 40 ఏళ్లతో జింబాబ్వేకు చెందిన ప్రెషియస్ మరాంగే ఉంది.