ఫేస్‌బుక్‌కు పోటీగా హలో.. డేటా భద్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌కు పోటీగా హలో.. డేటా భద్రం

April 11, 2018

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. యూజర్ల సమాచారాన్ని అమ్మేస్తోందని ఆరోపణలు రావడం తెలిసింది. దీనిపై కంపెనీ అధినేత మార్క్ జుకర్‌బర్గ్.. అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ కు దీటుగా మరో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం దూసుకొస్తోంది. ఫేస్ బుక్ రాకముందు ప్రపంచాన్ని ఊపేసిన  ఆర్కుట్‌  ఫౌండర్‌ ఆర్కుట్‌ బ్యూకుక్టన్ దీనికి నాంది పలికారు.

‘హలో’ పేరుతో  భారతీయ సోషల్‌ మీడియా  మార్కెట్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు. ‘ఇప్పటికే బ్రెజిల్, కెనడా  సహా 12 దేశాల్లో దీన్ని ప్రారంభించాం. విజయవంతంగా నడుస్తోంది. భారత్‌లో 35,000 మంది బీటా టెస్టింగ్లో భాగమై ఉన్నారు. హలో యాప్ స్టోర్, గూగుల్ ప్లేలలో హలోను  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్ల డేటా భద్రంగా ఉంటుంది. ఆదాయం పొందడానికి డేటాను అమ్మబోం. థర్డ్‌ పార్టీలకు షేర్‌ చేయం..’ అని ఆయన స్పష్టం చేశారు.

మన దేశంలోని 20 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్లలో కనీసం సగం మందినైనా టార్గెట్ చేసుకోవాలని హలో యత్నిస్తోంది. టర్కీకి చెందిన బ్యూకొక్టెన్ 2004లో తీసుకొచ్చిన ఆర్కుట్ 2014లో మూతపడింది. బ్యుకుక్టిన్ గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు దీన్ని రూపొందించారు. అయితే ఫేస్‌బుక్ రాకతో దానికి ఆదరణ తగ్గింది.