వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కొత్త పెళ్లికొడుకు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కొత్త పెళ్లికొడుకు మృతి

July 4, 2022

ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ మృతి చెందాడు. పుంగనూరుకు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి సుధాకర్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు తేజ విష్ణువర్ధన్‌రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ జాబ్ చేస్తున్నాడు. అతడికి రెండు నెలల కిందట వివాహమైంది. ఆయన భార్య లావణ్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆషాఢ మాసం కావడంతో లావణ్య వారం రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది.

రోజూ ఉదయాన్నే వ్యాయామం చేసే అలవాటున్న విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం ఉదయం ఎక్సర్‌‌సైజ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. సైక్లింగ్‌ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయిన విష్ణువర్ధన్‌ను గుర్తించిన తండ్రి వెంటనే గ్రామంలోని డాక్టర్‌కు సమాచారం అందించారు. ఇంటికి వచ్చి పరిశీలించిన డాక్టర్ అప్పటికే గుండెపోటుతో విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆషాడ మాసం తర్వాత కొత్త జంట తిరుమలకు వెళ్లి, అనంతరం హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. భర్త మృతి విషయం తెలుసుకున్న లావణ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.