బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఆ వ్యక్తి.. వ్యసనాలకు బానిసై సైకో లా ప్రవర్తించాడు. తన జల్సాలకు డబ్బులివ్వడం లేదని కన్నతల్లిని బెదిరించి.. కొత్తగా కట్టుకున్న ఇంటికి నిప్పంటించాడు. వివరాలిలా.. యాదాద్రి జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ప్రమీల, ముత్యం రెడ్డి ల కొడుకు.. శ్రవణ్ కుమార్ రెడ్డి(35) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోని గాజులరామారం వీనస్ రాక్స్ హైట్స్ కాలనీలో ఇటీవలే కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఇటీవల తన ఉద్యోగం పోవడంతో జల్సాలకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా తల్లి డబ్బులు అడిగితే ఇవ్వలేదని కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంట్లో ఘడియ పెట్టుకుని గ్యాస్ లీక్ చేసిన నిప్పు అంటించుకున్నాడు. చెయ్యి కోసుకున్నాడు. డబ్బుల కోసం నానా హంగామా చేశాడు. గతంలోనూ శ్రవణ్ కుమార్ రెడ్డి నాలుగుసార్లు డబ్బులు తీసుకుని ఇంటి నుంచి పారిపోయి జల్సాలు చేసి వచ్చాడు.
కొన్ని రోజులుగా రూ. 30 లక్షలు ఇవ్వాలని తల్లిని శ్రవణ్ కుమార్ రెడ్డి వేధిస్తున్నాడు. దీంతో డబ్బులు ఇవ్వడానికి తల్లి నిరాకరించింది. ఈ క్రమంలోనే గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకున్నాడు. ఇక ఇంట్లో నుంచి మంటలు వ్యాపించడంతో పక్క ఇళ్ళలో ఉన్న స్థానికులు బయటకు పరుగులు తీశారు. దీనిపై సమాచారం అంతుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది, పోలీసులు ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. మంటలు ఒక్కసారిగా దట్టంగా వ్యాపించటంతో భయపడిన శ్రవణ్ కుమార్ రెడ్డి బాత్రూంలో దాక్కున్నాడు. ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు బాత్రూంలో స్పృహతప్పి పడిపోయిన శ్రవణ్ కుమార్ రెడ్డి ని బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.