ఏడాది క్రితం ప్రేమపెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరువు హత్య? - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాది క్రితం ప్రేమపెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరువు హత్య?

July 3, 2022

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురయ్యాడు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 1లో నారాయణరెడ్డి(25) అనే టెక్కీ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటున్నాడు. జూన్ 30న అతడు కనపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే జిన్నారం సమీపంలోని నారాయణరెడ్డి గుర్తుపట్టలేని రీతిలో శవమై కనిపించాడు. అతడిని ప్రాణాలు తీసిన దుండగులు మృతదేహాన్ని తగులబెట్టేశారు.Advertisement

నారాయణ రెడ్డి ఓ యువతిని ప్రేమించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి యువతి కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో వారు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. అప్పటినుంచి నారాయణరెడ్డి స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే గత నెల రోజుల నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. దీంతో యువతి బంధువైన శ్రీనివాసరెడ్డి.. నారాయణరెడ్డిపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది

మృతుడి కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాస్‌రెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్‌ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట తాగారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబసభ్యులే నారాయణరెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.