ఏపీకి డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు

May 31, 2022

గోవా నుంచి ఏపీలోని రాజమహేంద్రవరంకి డ్రగ్స్ తరలిస్తూ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడకు చెందిన వట్టూరి సూర్య పంత్, రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీంద్రలు గత కొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. అయితే డ్రగ్స్ స్థానికంగా దొరక్కపోవడంతో వాటి కోసం ఇద్దరూ కలిసి గోవా వెళ్లారు. అక్కడ ఈ నెల 25న ఎండీఎంఏ (25 మాత్రలు), ఎల్ఎస్‌డీ (2 స్ట్రిప్పులు) కొనుగోలు చేసి హైదరాబాదుకు బస్సులో చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో ఏపీకి వెళ్తే దొరికిపోతామని భావించి వ్యూహాత్మకంగా నగర శివారులోని అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద లారీ ఎక్కారు. ఈ విషయం పక్కాగా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు లారీ చౌటుప్పల్ వద్దకు రాగానే ఆపి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2.35 లక్షల విలువైన డ్రగ్స్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో నల్గొండ జైలుకు తరలించారు.