Software engineers caught with four kg of marijuana
mictv telugu

గంజాయితో పోలీసులకు చిక్కిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

December 21, 2022

Software engineers caught with four kg of marijuana

వారు చక్కగా చదవుకున్నారు. ఉద్యోగం చేస్తూ మంచి జీతం అందుకుంటున్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. అయితే చెడు వ్యసనాలకు బానిసై..ఈజీ మనీ కోసం పాకులాడి చివరకు జైలు పాలయ్యారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కాగా, ఒకరు బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ఓ కారును ఆపి అందులో ఉన్న యువకుల వివరాలను అడిగారు. అయితే పోలీసులను చూసిన వారు భయంతో మాట్లాడారు. వారి ప్రవర్తనలో అనుమానం వచ్చి కారులో పోలీసులు తనిఖీలు చేయగా నాలుగు కేజీల గంజాయి వారి కంట పడిండి. దీంతో వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. చివరకు గూడెం కొత్తవీధి మండలం చల్లనిశిల్పలో గంజాయి కొని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు తేలింది.

నిందితుల నుంచి గంజాయితోపాటు, నాలుగు సెల్‌ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‎కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పట్టుబడిన నిందితులు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గండికోట లక్ష్మీసాయి, ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ కిజార్‌ అహ్మద్‌గా గుర్తించారు. బి.కున్నులు అనే వ్యక్తి వారికి గంజాయిని సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు. విలాసాలకు అలవాటు పడి.. డబ్బు కోసం అడ్డదారుల తొక్కి జైలుపాలవ్వదంటూ యువకులకు పోలీసులు సూచిస్తున్నారు.