నీటి సునామీ విన్నాం కానీ ఈ సౌర సునామీ ఏంటీ అని కంగారు పడుతున్నారా? అయితే ఈ కథనం చదవండి. ప్రాణకోటికి జీవనాధారమైన సూర్యుడిలో నిత్యం అనేక విస్పోటనాలు జరుగుతుంటాయి. వీటి నుంచి ఊహించనంతటి శక్తి విడుదలవుతుంది. దీనిని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఇలాగే ఇటీవల సూర్యుడిలో అత్యంత భారీ విస్పోటనం జరిగిందని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్వారా భారీ సౌర సునామీ ఏర్పడిందని, ఇది శనివారం (జులై 23)న భూ వాతావరణాన్ని తాకనుందని వెల్లడించారు.
ఈ క్రమంలో అపరిమిత వేగంతో సౌర తరంగాలు భూ ఆయస్కాంత క్షేత్రాన్ని ఢీకొంటాయని పేర్కొన్నారు. కోల్కతాలోని ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ ఇండియా వారు సూర్యుడికి సంబంధించిన ఈ మార్పును గమనించారు. సూర్యుడి మధ్య భాగంలో ఏర్పడిన అతిపెద్ద రంధ్రాన్ని గుర్తించి వాటిని విశ్లేషించి పై విషయం తేల్చి చెప్పారు.