కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్.. కె.విశ్వనాథ్ గా చాలా పాపులర్. ఈ దర్శకుడు ఈ రోజు మన మధ్య లేరు. కళాతపస్వికి అందరూ కన్నీటి వీడ్కోలు చెబుతున్నారు.
ఈ లెజెండరీ దర్శకుడు 92 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నూమూశారు. విశ్వనాథ్ తన సినిమాల ద్వారా తెలుగు సంప్రదాయాన్ని, కళలను, సంస్కృతిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. మరి ఆయన గురించి కొన్ని విషయాలు..
– గుంటూరు జిల్లా రేపల్లెలో 1930వ సంవత్సరం ఫిబ్రవరి 19న జన్మించారు విశ్వనాథ్.
– ఆ దర్శకుడి మొట్టమొదటి బ్లాక్ బస్టర్, జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం శంకరాభరణం 1979 ఫిబ్రవరి 2న విడుదలైంది. 44 సంవత్సరాల తర్వాత అదే రోజున ఆయన మరణించారు.
– నటులు చంద్రమోహన్, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ.. విశ్వనాథ్ కజిన్స్.
– 1951లో తెలుగు – తమిళ చిత్రం ‘పాతాళ భైరవి’కి సహాయ దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించారు. ఈ సినిమా నందమూరి తారక రామారావుకు అపూర్వమైన కీర్తిని తెచ్చి పెట్టింది.
– విశ్వనాథ్ గారి తొలి తెలుగు చిత్రం ‘ఆత్మ గౌరవం’. ఇది 1965లో దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, రాజశ్రీ నటించారు. ఈ సినిమా ఆ సంవత్సరం ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును అందుకుంది.
– కాశీనాథుని విశ్వనాథ్ గుంటూరు హిందూ హిందూ కళాశాలలో చదువుకున్నారు. అంతేకాదు.. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు.
– మద్రాసు (ప్రస్తుత చెన్నై)లోని వాహిని స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.
– ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ లో శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సూత్రధారులు సినిమాలు తీశారు.
– కె. విశ్వనాథ్ ప్రతి చిత్రానికి ‘ఎస్’ అనే అక్షరంతో పేరు పెట్టే సెంటిమెంట్ ఉండేది. 80, 90లలో అతను అదే అక్షరంతో సినిమాలను తీశారు.
– 1995 నుంచి ఆయన నటనలోకి ప్రవేశించారు. 2015లో కమల్ హాసన్ తో కలిపి చివరిగా ఉత్తమ విలన్ సినిమాలో కనిపించారు.
– పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సహకారంతో ఆయన రూపొందించిన అనేక చిత్రాలు రష్యన్ భాషలోకి డబ్ చేయబడి మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డాయి.
– కె. విశ్వనాథ్ సుమారు 5 జాతీయ అవార్డులు, 15 నంది అవార్డులు, అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందారు.
– కళాతపస్వి శాఖాహారి. శుభసంకల్పం సినిమా కోసం అతను చేప ముక్క తినేలా నటించాల్సి వచ్చింది. అందుకోసం చేపల కూరలాగా వంకాయను వండమని ప్రొడక్షన్ వ్యక్తులను ఆదేశించారు. ఈ సినిమా బాల సుబ్రహ్యణ్యం గారు నిర్మించారు.