Some Times Saying No For Good Make You Happy
mictv telugu

సంతోషంగా ఉండాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి

March 17, 2023

Some Times Saying No For Good Make You Happy

జీవితం హాయిగా ప్రశాంతంగా గడవాలంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు. పొద్దున్నే లేవడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం లాంటివి ఎప్పుడూ మనకు మేలే చేస్తాయి. అయితే వీటితో పాటూ కొన్ని అలవాట్లని కూడా వదుల్చుకోవాలి కూడా. మంచి అలవాట్ల గురించి చాలా మందికి తెలుస్తుంది కానీ ఏ అలవాట్లను వదుల్చుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. అలాంటి వారి కోసమే ఇది.

నో చెప్పగలగాలి:

మీరు చేసే పనులే కాక, ఇంట్లో ఆఫీసులో కూడా మీ మీద ఎక్కువ పనులు పడిపోతున్నాయా? దీనికి కారణం మీరు నో చెప్పలేకపోవడమేనేమో ఒక్కసారి ఆలోచించండి. నో చెప్తే అవతలి వారు హర్ట్ అవుతారేమో అన్న ఆలోచనతో ఎన్ని పనులు చెప్తున్నా వాటకి పనికి యస్ చెప్పకండి. దానివలన మీ పనులు పక్కకి పోతాయి, ఒత్తిడి ఎక్కువైపోతుంది. అలాగే, మీకు నచ్చకపోయినా కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా కూడా మీ ప్రయారిటీస్ పక్కకి వెళ్ళిపోతాయి. ప్రతీదీ నా ఇష్ట ప్రకారమే చేస్తాను అనడం ఎంత అసమంజసంగా ఉంటుందో, ప్రతీదీ ఇంకొకరి ఇష్ట ప్రకారం చేయడం కూడా అంతే అసమంజసంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి.

హెల్ప్..

మనిషి సంఘ జీవి. ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధార పడకుండా మనిషి జీవించలేడు. అలాగే ఒకరి సహాయం కూడా ఇంకొకరికి అవసరం. మీకు సహాయం అవసరమైనప్పుడు అడగటానికి సందేహించకండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ సహాయంతో సమస్యలని ఎదుర్కోండి. మీరు ఒంటరి కాదు, అది గమనించండి. మీరు ఇంకొకరికి సహాయం చేసే ఉంటారు కదా, మీకు అవసరమైనప్పుడు మీరు మరొకరి సహాయం అడగడం, తీసుకోవడం సహజంగా జరిగే విషయాలే. వాటికి ఫీల్ అవ్వకండి.

ఎనర్జీ..

మన ఎనర్జీ మనకు ఎంతో విలువైనది. దాన్ని ఏ విషయాల్లో ఎవరి మీద ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనల్ని నెగటివ్ గా ఇన్ష్లూయెన్స్ చేసే వారి మీద మన ఎనర్జీని వినియోగించడం శుద్ధ తెలివిమాలిన పని. సంతోషంగా ఉండి పక్క వారి సంతోషాన్ని కోరుకునే వారి సమక్షంలో ఉండడం ఎప్పుడూ మంచిది. మన జీవితం బాగుండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటారు, అందుకు వారు చేయగలిగిన సాయం ఏమైనా ఉంటే వెంటనే చేస్తారు. అన్నింటి కన్నా ముందు మనల్ని ఎంకరేజ్ చేస్తారు.

సోషల్ మీడియా..

అతి సర్వత్ర వర్జయేత్ అనే సూక్తి సోషల్ మీడియా వాడకం విషయంలో బాగా పని చేస్తుంది. సోషల్ మీడియా ద్వారానే మనం ఎంతో మందితో కనెక్ట్ అవుతున్నాం, విషయాల మీద భిన్నాభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. ఇదంతా మంచిదే, కానీ ఇది మితి మీరితేనే ప్రమాదం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల మనకి తెలియకుండానే మనలో కొన్ని మార్పులు జరిగిపోతాయని, అవి మన మానసిక శారీరక ఆరోగ్యానికి అంత మంచివి కావనీ నిపుణూలు అంటున్నారు.

కంపారిజన్..

పోటీ ఆరోగ్యకరమే కానీ పోలిక అనారోగ్యకరం. మనం మనలా ఉంటాం, మనలా ఇంకొకరు ఉండరు. కాబట్టి మన జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకోవడం అనవసరం. అదీ కాక, ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికే పరిమితమైన, వారికే ప్రత్యేకమైన సుఖ దుఃఖాలూ, లాభ నష్టాలూ ఉంటాయి. మనకి కనిపించడంలేదు కాబట్టి వారికి అవి లేవని అనుకోకూడదు. మన ఆలోచనలనీ, మన శక్తి యుక్తులనీ ఇంకా చక్కగా జీవించడానికి వినియోగించుకోవాలి.

తరువాత..

ఇవాళ అంత ఉత్సాహంగా లేదు, రేపెలాగా ఆదివారమే కాబట్టి సోమవారం నించీ ఈ పని మొదలు పెడదాం వంటి తాత్సారాలు మనని ముందుకు సాగనీయవు. ఏ పనైనా మొదలు పెట్టే వరకే భయంగా ఉంటుంది, మొదలు పెట్టిన తరువాత ఇంత చిన్న దాని కోసమా మనం అంత ఆలోచించాం అనిపిస్తుంది.

నిర్లక్ష్యం..

ఎవరినో కాదు, మనని మనమే. మన ఆరోగ్యం గురించి ఆలోచించకపోవడం, సెల్ఫ్ కేర్ లేకపోవడం, ఒత్తిడి తట్టుకోలేక కొన్ని వ్యసనాలు అలవాటు చేసుకోవడం వంటివన్నీ మనని మనం నిర్లక్ష్యం చేసుకోవడం కిందకే వస్తాయి. ఈ అలవాట్లకి ఎంత త్వరగా దూరమైతే అంత మంచిది.

బింజ్ వాచ్..

టీవీ సీరియల్స్ అయితేనేమి, సినిమాలైతేనేమి మీ విలువైన సమయాన్ని వీటి మీద మరీ ఎక్కువగా ఖర్చు పెట్టకండి. వినోదం అవసరమే కానీ, మీ ఇతర పనులనీ, ఫ్యామిలీతో మీరు గడిపే సమయాన్నీ పక్కన పెట్టేసేంత అవసరం కాదు. వీటి మీద మీరు గడిపే సమయన్ని ఇంకా ప్రొడక్టివ్ గా గడపవచ్చేమో చూడండి.