దిశ నిందితుల్లో ఒకడికి ప్రాణాంతక వ్యాధి - MicTv.in - Telugu News
mictv telugu

దిశ నిందితుల్లో ఒకడికి ప్రాణాంతక వ్యాధి

December 2, 2019

Someone 01

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యచారం కేసు నిందితుల్లో ఒకడైన చింతకుంట చెన్నకేశవులుకు ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ప్రేమ వివాహం చేసుకున్న అతనికి కిడ్నీ సమస్య ఉందని అతని తల్లి జయమ్మ చెప్పింది. జైలు వర్గాలు కూడా ఈ విషయం వెల్లడించాయి. ‘అతనికి  ఆరు నెలలకోసారి డయాలసిస్‌ అవసరం. గతంలో నిమ్స్‌లో చికిత్స చేయించుకున్నాడు. నిమ్స్‌ వైద్యులను సంప్రదించి వైద్యం అందజేస్తాం’ అని పేర్కొన్నాయి.

 లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న చెన్నకేశవులు డ్రైవింగ్ కూడా చేస్తాడని తెలుస్తోంది. తన కొడుకు చాలా దారుణమైన పనికి ఒడిగట్టాడని.. అతనికి శిక్ష వేయాలని చెన్నకేశవులు తల్లి జయమ్మ కూడా చెప్పింది. అతని భార్య కూడా  ఆ దారుణాన్ని దుయ్యబట్టింది. నేరం చేశాడని రుజువైతే శిక్ష వేయండని తెలిపింది. తనను పెళ్లి చేసుకున్నాక ఎప్పుడూ తనతో చెడుగా ప్రవర్తంచలేదని.. ఆ లారీ డ్రైవర్ మహ్మద్ వల్లే తన భర్త చెడిపోయాడని చెప్పింది. ఇప్పటికే నలుగురు నిందితుల కన్నవాళ్లు స్పందించారు. కూతుర్ని పోగొట్టుకుని పుట్టెడు దుఖ్ఖంలో ఉన్న దిశ తల్లిదండ్రుల దుఖ్ఖం ఎలాంటిదో తమకు తెలుసని.. తమ కొడుకు తప్పు చేస్తే ఉరి తీయండని చెప్పారు. కాగా, వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.