యూట్యూబులో చూసి బాంబు తయారీ.. పొరుగింటిపై ప్రయోగం - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబులో చూసి బాంబు తయారీ.. పొరుగింటిపై ప్రయోగం

June 3, 2022

యూట్యూబులో బాంబులు ఎలా తయారు చేయాలి? అనే వీడియోలను చూసి ఓ వ్యక్తి బాంబు తయారీని నేర్చుకున్నాడు. అనంతరం దానిని తన పొరుగింటిపై ప్రతీకారానికి వాడుకున్నాడు. పోలీసులనే ఆశ్చర్యపరచిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌కు చెందిన రణవీర్ సింగ్ (45) అనే వ్యక్తికి పక్కింటోళ్లతో గొడవలున్నాయి. దాంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని తలచి యూట్యూబ్ ద్వారా బాంబుల తయారీని నేర్చుకున్నాడు. అందులోనూ ఎలక్ట్రిక్ బాంబును తయారు చేశాడు. అది పని చేస్తుందో లేదో తెలుసుకుందామని పొలాల్లో ప్రయోగించాడు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఆ బాంబును పక్కింటి మెయిన్ డోర్ వద్ద అమర్చాడు. ఆ ఇంట్లోని గౌతమ్ సింగ్ (17) బాంబు విషయం తెలియన డోరు తీయడంతో బాంబు పేలింది. దీంతో గౌతమ్ సింగ్ ముఖం తీవ్ర గాయాలపాలైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు. తరువాత ఈ ఘాతుకానికి పాల్పడింది పక్కింటి వాడైన రణవీర్ సింగ్ అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగా, బాంబులు ఎలా తయారు చేస్తావో చేసి చూపించు చూస్తామని పోలీసులు కోరగా, వారి ముందే అప్పటికప్పుడు బాంబును తయారు చేసి చూపించాడు రణవీర్ సింగ్. అంతేకాక, కొన్ని మార్పులతో దానిని ఇంకా శక్తివంతం చేశాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాలన్నీ తెలిపిన జిల్లా ఎస్పీ నీరజ్.. బాంబు తయారీ వీడియోలపై యూట్యూబ్ సంస్థకు లేఖ రాశానని వెల్లడించారు. సమాజానికి హానికరమైన వీడియోలను తొలగించాలని కోరినట్టు తెలిపారు.