తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వీఆర్ఎస్ తీసుకోగా సీఎం జగన్ వెంటనే ఆమోదించేశారు. దీంతో ఫ్రీ అయిన సోమేశ్ కుమార్ తెలంగాణ రెరా చైర్మన్ పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు రెరాతో పాటు 9 కీలక పదవులను ఏకకాలంలో నిర్వహించి పరిపాలనలో చక్రం తిప్పిన సోమేశ్.. రెరా పదవిపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ని మూడు సార్లు కలిసినట్టు సమాచారం. సోమేశ్ ఉన్నంతవరకు ప్రత్యేకంగా రెరాకి చైర్మన్‌ని నియమించలేదు. అప్పుడు ఆదాయం పెంచడం కోసం చేసిన ప్రత్యేక డ్రైవ్‌లను ప్రముఖంగా ప్రభుత్వ పెద్దల ముందు ఉంచుతున్నారు.
దాంతో పాటు తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ ప్రముఖులతో లాబీయింగ్ చేస్తున్నారని భోగట్టా. అటు రియల్ ఎస్టేట్ ప్రముఖులు కూడా సోమేశ్ ఉంటే తమకు లాభమే అనే కోణంలో ఆలోచిస్తున్నారంట. ఈ పదవికి సోమేశ్‌తో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సాగునీటి పారుదల సలహాదారు ఎస్‌కే జోషి కూడా పోటీ పడుతున్నారు. అయితే సోమేశ్ ఇప్పటికే ధరణి వ్యవహారాలు పర్యవేక్షించగా, దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో రెరా చైర్మన్ పదవి ఇవ్వడంపై సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే కీలకమైన పదవులన్నీ బీహారీల చేతిలో పెట్టారనే విమర్శ ఎలాగూ ఉంది. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నందున కేసీఆర్ సాహసిస్తారా? అనేది చూడాలి.