రాజధాని విషయంలో ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మోసం చేయలేదని అన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి.. వైసీపీతో పాటు టీడీపీ కూడా కారణమన్నారు. శుక్రవారం అమరావతి ప్రాంతంలో ‘మనం.. మన అమరావతి’ నినాదంతో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన సోము వీర్రాజు.. రాజధాని విషయంలో కేంద్రం ఎక్కడా మోసం చేయలేదన్నారు. ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించామని, రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుందన్నారు.
కేంద్రం కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేంద్రం కంటే పరిస్థితి బాగుంటే.. కేంద్రమిచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్ధిక పరిస్థితి అంతా బాగుంటే రోజూ అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారన్నారు. రాజధాని ఎందుకు కట్టలేదని నిలదీశారు. రాజధాని రైతులను ఆదుకోవడంపై బీజేపీ దృష్టి సారిస్తుందని, ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.