నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసే కొడుకులు కోకొల్లలు. పెళ్లాం తియ్యన, తల్లి చేదు అని భార్యల కొంగు పట్టుకుని తిరుగుతూ కన్నవాళ్లను చీదరించుకునే కొడుకులకు చెంపపెట్టులాంటి వార్త ఇది. కన్నతల్లిని వేధిస్తున్న కొడుక్కి, అతని భార్యకు జైలుశిక్ష పడింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సంచలన ఉదంతం చోటుచేసుకుంది. నరసాపురానికి చెందిన పుల్లూరి నాగమణి అనే వృద్ధురాలు భర్త చనిపోవడంతో కొడుకు వెంకన్నబాబు, కోడలిపై ఆధారపడి జీవిస్తోంది. అయితే వాళ్లు ఆమెకు అన్నం పెట్టకుండా, హింసలు పెడుతున్నారు.
కొడుకు మారతాడేమేనని ఆమె ఎదురుచూసింది. బంధువులతో చెప్పించింది. అయినా కొడుకు, కోడలు హింస్తూనే ఉండడంతో గత ఏడాది జూన్ నెలలో సబ్ కలెక్టర్ సూర్యతేజకు ఫిర్యాదు చేసింది. ఆయన నిందితులను పిలిచించి మందలించారు. అప్పటికే సరేనన్న వెంకన్న ఇంటికెళ్లాక తల్లిని మళ్లీ వేధించడం, భౌతికంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. నాగమణి మళ్లీ ఫిర్యాదు చేసింది.
కేసును విచారించిన సూర్యతేజ తన అన్ని వివరాలను ఆరా తీసి వృద్ధురాలపై వేధింపులు నిజమేనని నిర్ధారించారు. చట్ట ప్రకారం తనకున్న అధికారాన్ని ప్రయోగించి కొడుక్కి, కోడలికరి రెండు వారాల జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా వారు వెంటనే ఇల్లు ఖాళీ చేసి, పెద్దామెకు అప్పగించాలని ఆదేశించారు. ఇంట్లో ఓ భాగాన్ని అద్దెకిచ్చి, అద్దె డబ్బుతో ఆమె జీవించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.