లక్ష రూపాయలు ఇస్తేనే తలకొరివి పెడతా..  - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష రూపాయలు ఇస్తేనే తలకొరివి పెడతా.. 

January 11, 2020

 

Father

‘కొరివి పెట్టేవాడు కొడుకు’ అని సామెత ఉంది. బతికున్నప్పుడు కొడుకు తమకు తిండి పెట్టకపోయినా పర్వాలేదు గానీ, చచ్చాక తలకొరివి పెడితే చాలు అని చాలామంది కన్నవాళ్లు కోరుకుంటారు. అది ఈయన విషయంలో అబద్ధమనే తేలింది. 17 ఏళ్లుగా తండ్రిని దూరం పెట్టిన దుర్మార్గపు కొడుకు ఆయన చనిపోయాక తలకొరివి పెట్టడానికి డబ్బు అడిగాడు. లక్ష రూపాయలు ఇస్తేగానీ తలకొరివి పెట్టనన్నాడు. కొడుకు మాటలు విని ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించిందో పాపం! తర్వాత పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో అప్పుడు తలకొరివి పెట్టాడు. 

ఒడిశాలోని భద్రక్ జిల్లా బజరాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బడిపంతులుగా పదవీ విరమణ చేసిన అనామచరణ్ బంధు భార్య చనిపోవడంతో కొడుకు  వద్ద ఉండేవాడు. కొడుకూ కోడలు వేధించడంతో 17 ఏళ్ల క్రితం స్నేహితుడు గజేంద్ర సాహు ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఇన్నేళ్లలో ఆ సుపుత్రుడుతండ్రిని పలకరించిన పాపాన పోలేదు. ఆయన యోగ క్షేమాల గురించి కూడా పట్టించుకోలేదు. స్నేహితుడే ఆయనకు అన్నీ అయ్యారు. ఇటీవల అనామచరణ్ అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయాన్ని కుమారుడికి గజేంద్ర సాహు తెలియజేశారు. అయినప్పటికీ ఆ కొడుకు హృదయం కరగలేదు. చిన్నప్పుడు తనకు చిన్న గాయం తగిలితేనే తాయిమాయి అయిన తండ్రి గురించి కాస్త కూడా ఆలోచించలేదు ఆ కొడుకు. కనీసం తండ్రిని చూసేందుకు కూడా వెళ్లనంత బండరాయి అయిపోయాడు.

బుధవారం రాత్రి అనామచరణ్ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుమారుడికి చెప్పి అంత్యక్రియలు నిర్వహించాలని గజేంద్ర కోరారు. తండ్రి చనిపోయాడనే బాధ కాస్త కూడా చూపకుండా..  17 ఏళ్లుగా తన తండ్రి పింఛను తీసుకుంటున్నాడని, తనకు ఏమాత్రం ఇవ్వలేదని వాదనకు దిగాడు. ఇప్పుడు తనకు లక్ష రూపాయలు ఇస్తేనే తలకొరివి పెడతానని, లేదంటే లేదని భీష్మించుక్కూర్చున్నాడు. దీంతో గజేంద్ర పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వచ్చి అతడితో మాట్లాడి మెదడు వాష్ చేశారు. అప్పుడు ఆ కొడుకు తలకొరివి పెట్టాడు.