గుంటూరులో ఘోరం.. ఆస్తి ఇవ్వలేదని కన్నతల్లి శవాన్ని..  - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో ఘోరం.. ఆస్తి ఇవ్వలేదని కన్నతల్లి శవాన్ని.. 

May 26, 2020

mnfbh

మృతదేహాలను ముట్టుకోవాలంటేనే జనం భయపడుతున్నారు. కరోనా సోకుతుందని అంత్యక్రియలకు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ ఆమెకు కరోనా లేదు. వృద్ధాప్యం వల్లే కన్నుమూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన ఆ మాతృమూర్తిని సగౌరవంగా సాగనంపాల్సిన కొడుకు అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. బతికి ఉన్నప్పుడు తనకు ఆస్తి రాసివ్వలేదంటూ తల్లి శవాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని హుకుం జారీ చేశాడు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ దారుణం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన నాగమల్లేశ్వరరావు జనవరిలో చనిపోయాడు. కొడుకు మల్లేశ్వరరావు అప్పట్లో ఆస్తికోసం పంచాయతీ పెట్టాడు. అయితే తండ్రిని సరిగ్గా చూసుకోని నీకు ఆస్తి ఎందుకివ్వాలని అతని సోదరి నిలదీసింది. ఆస్తి పంపకంలో అంతకు ముందే పోలీసులు వద్ద పంచాయతీ కూడా జరిగింది. కొడుకు తమను చంపేస్తారని మల్లేశ్వరరావు, ఆయన భార్య ధనలక్ష్మి ఫిర్యాదు చేశారు. తండ్రి చనిపోవడంతో ఆస్తి తనకు రాసివ్వాలని మల్లేశ్వరరావు తల్లిని వేధించాడు. కూతురు కూడా ఉందని, ఇప్పుడే రాయనని ఆమె స్పష్టం చేసింది. దీంతో అతడు ఆమెను కొట్టి వేధించాడు. పోరు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకు చంపుతాడనే భయంతో కూతురింటికి వెళ్లిపోయింది.

ధనలక్ష్మి సోమవారం అనారోగ్యంతో చనిపోయింది. మృతదేహాన్ని కూతురు మల్లేశ్వరరావు ఇంటికి తీసుకెళ్లింది. అయితే తనకుఆస్తి ఇవ్వని తల్లికి అంత్యక్రియలు చేయనని, తన ఇంట్లోకి తేవొద్దని కొడుకు భీష్మించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడంతో తల్లికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇలాంటి కొడుకు ఎవరికీ పుట్టొద్దని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.