ఇటీవలే కరోనా బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జూన్ 2న సోనియాకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆమె ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అయితే, కరోనా సంబంధిత సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు.
ఇదే కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 2న ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 13న హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రాహుల్ ఈడీ ఎదుట హాజరౌతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.