నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమె వెంట కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. మహిళతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం సోనియాను విచారించనున్నారు. సోనియా ఆరోగ్యం బాగాలేక తాను కూడా వెంట ఉంటానని ప్రియాంక చెప్పగా, ఈడీ అధికారులు తిరస్కరించి, మరో గదిలో వేచి ఉండాల్సిందిగా సూచించారు. అంతకుముందు విచారణకు ఢిల్లీలోని తన నివాసం నుంచి సోనియా బయల్దేరగా, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదికాక, లోక్సభలో విపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది. కాగా, ఇప్పటికే రాహుల్ గాంధీ ఈడీ విచారణ ఎదుర్కోగా, అప్పుడు సోనియాగాంధీకి కరోనా సోకడంతో విచారణ ఆలస్యమైంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.