రాజకీయాల నుంచి సోనియా తప్పుకుంటారనే వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. 85వ ప్లీనరీ సమావేశాల్లో సోనియా చేసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేయొద్దని పార్టీ నాయకులు కోరుతున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్కా లంబా తెలిపారు. ” సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదు. ఆమె ప్రసంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కేవలం అధ్యక్ష పదవి బాధ్యతలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. రాజకీయాలకి దూరంగా ఉంటానని ఎక్కడా చెప్పలేదు. ఆ వార్తలను చూసి సోనియా నవ్వుకున్నారు” అని అల్కా లంబా వెల్లడించారు.
సోనియా ఏమన్నారంటే..
రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో బాగంగా సోనియా మాట్లాడారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ వంటిదని చెప్పారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందన్నారు. దేశానికి కాంగ్రెస్‌కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివని చెప్పారు. గట్టి కార్యకర్తలే పార్టీకి బలమని తెలిపారు.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలతో సంతృప్తి చెందినట్లు సోనియా గాంధీ వివరించారు. సోనియా చేసిన ఈ ప్రసంగం అనంతరం ఆమె రాజకీయల నుంచి తప్పుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.