కొడుక్కి కరోనా.. కొత్తగూడెం డీఎస్పీపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

కొడుక్కి కరోనా.. కొత్తగూడెం డీఎస్పీపై కేసు

March 23, 2020

Sons Corona Positive.. Case against Bhadradri Kuthagudem DSP

కరోనా విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన కొత్తగూడెం వన్ టౌన్ డీఎస్పీ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు అవాజ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో డీఎస్పీపై కేసు నమోదు అయింది. ఇటీవలే అవాజ్ లండన్ నుంచి వచ్చాడు. అయితే విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వ ఆంక్షలు ఉన్నా ఆయన విస్మరించారు. అవాజ్‌కి కొంత కాలంగా అనారోగ్యం ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది.
అవాజ్ లండన్ నుంచి వచ్చాక  పశ్చిమగోదావరి జిల్లా రాఘవాపురంలోని బంధువుల ఇంటికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి అక్కడ సయ్యద్ షౌకత్ అలీ అనే వ్యక్తి గృహ ప్రవేశానికి హాజరయ్యాడు. అవాజ్‌కు కరోనా అని తేలడంతో ఏలూరులోని వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు. డీఎస్పీ ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించలేదు. తన కుమారుడ్ని క్వారంటైన్ చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. 

మరోవైపు ప్రభుత్వ ఆంక్షలను ఖాతరు చెయ్యకుండా ఇష్టానుసారం బయట తిరిగేస్తున్నవారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్- 1897 కింద 60 మందిపై కేసులు నమోదు చేసింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నా వినకుండా వారు ప్రవర్తిస్తున్న తీరుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటికి వస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిని ఉపేక్షించొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. కాగా, ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రజలు ఎవరి ఇళ్లలో వారే ఉండాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చినవారికి క్వారంటైన్ స్టాంప్ వేశారు. అయినా కొందరు బయట తిరగడం గమనించామని, వాళ్లను బయటకు వెళ్లనివ్వొద్దని తల్లిదండ్రులకు గతంలోనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.