Sorry to all the fans..let's accept the challenge: NTR
mictv telugu

ఫ్యాన్స్‌ అందరికీ సారీ..ఈ సవాల్‌ను స్వీకరిద్దాం: ఎన్టీఆర్

September 3, 2022

”ముందుగా అభిమానులందరికీ తలవంచి క్షమాపణలు చెప్తున్నాను నన్ను క్షమించండి. ఎంతో ఆర్భాటంగా వేడుకని నిర్వహించాలనుకున్నారు. కానీ, భద్రత కారణాలతో కుదరలేదు. పోలీసుల మాట వినడం ఈ దేశపౌరుడిగా నా ప్రథమ ధర్మం. అంతర్జాతీయ స్థాయిలో చిత్ర పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోంది. ప్రేక్షకుడికి ఇప్పుడు మనం ఇస్తున్న దానికంటే కొత్తది ఇంకేదో కావాలి. ఒత్తిడిలోనే బాగా పనిచేస్తామని నేను నమ్ముతాను. పరిశ్రమ మొత్తం ఈ సవాల్‌ని స్వీకరిద్దాం. రానున్న రోజుల్లో మంచి సినిమాలు చేద్దాం” అని టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు.

గతరాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మాస్త్ర’ వేడుకకి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, ఈ వేడుక రామోజీ ఫిలిం సీటీలో జరగాల్సి ఉండగా, నిర్వహణ కోసం ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడంతో బందోబస్తుని కల్పించడం కష్టమని, అనుమతులు నిరాకరించినట్టు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు. దాంతో అప్పటికప్పుడు అప్రమత్తమైన చిత్రబృందం..హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వేడుకని నిర్వహించింది.

ఈ క్రమంలో వేడుకలో పాల్గొన్న ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ..”రామోజీ ఫిలింసిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమైన వేడుకని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఐదు రోజుల ముందు కూడా పోలీస్ కమిషనర్ దగ్గర్నుంచి కూడా అనుమతి వచ్చింది. అన్నీ బాగున్నాయని చెప్పారు. కొన్ని మార్పులు కూడా సూచించారు. ఈ రోజు గణేశ్ ఉత్సవాల్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయలేమన్నారు” అని ఆయన అన్నారు.

ఇక, ‘బ్రహ్మాస్త’ చిత్రం విషయానికొస్తే..ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, అలియాభట్ కథానాయికగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఫ్రేమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా..ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.