Sorry.. We could not lay the road properly : Nitin Gadkari
mictv telugu

క్షమించండి.. రోడ్డు సరిగ్గా వేయలేకపోయాం : నితిన్ గడ్కరీ

November 9, 2022

Sorry.. We could not lay the road properly : Nitin Gadkari

కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని, ఆ టెండర్లు రద్దు చేసి మరో కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్‌‌‌లోని మండ్లా నుంచి జబల్ పూర్ వరకు నిర్మిస్తున్న రహదారిలో బరెలా నుంచి మండ్లా వరకు వేసిన 63 కిలోమీటర్ల రోడ్డులో నాణ్యత లోపించింది. ఈ విషయంలో తనను క్షమించాలని జబల్ పూర్‌‌‌లో జరిగిన సభలో గడ్కరీ ప్రజలను కోరారు.

పక్కనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండడం గమనార్హం. ‘తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడానికి నేను వెనుకాడను. రోడ్డు నిర్మాణంలో సమస్య ఉందని నాకు తెలుసు. పెండింగులో ఉన్న పని గురించి కాంట్రాక్టరుతో మాట్లాడమని అధికారులకు సూచించాను. పరస్పరం అంగీకారానికి వచ్చి కొత్త టెండర్లు పిలిచి రోడ్డును మళ్లీ వేయాలని ఆదేశించాను. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణ అడుగుతున్నా’నని మంత్రి చెప్పగానే ఆ ప్రాంగణలో ఉన్నవారంతా చప్పట్లతో ప్రశంసించారు. ఇదే సమావేశంలో రాష్ట్రానికి తన హయాంలోనే రూ. 6 లక్షల కోట్ల విలువైన రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, అటవీ అనుమతులు తొందరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు.