తెలుగోడి తర్వాత దాదానే.. బీసీసీఐ పీఠంపై క్రికెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగోడి తర్వాత దాదానే.. బీసీసీఐ పీఠంపై క్రికెటర్

October 14, 2019

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం దాదాపు ఖాయమవగా.. ఈ పదవి చేపట్టనున్న రెండో క్రికెటర్‌గా గంగూలీ రికార్డు కైవసం చేసుకోనున్నాడు. అతడి కంటే ముందు విజయనగరం మహారాజు విజయ ఆనంద గజపతిరాజు (విజ్జీ) ఆ పదవిని చేపట్టారు. విజయనగర సంస్థానం మహారాజు పుసపాటి విజయ రామ గజపతిరాజుకు విజ్జీ రెండో కుమారుడు. ఆయన మూడు టెస్టులు, 47 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడారు.

Ganguly

ఆయన 1936 ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత జట్టుకు సారథిగా వున్నారు. ఆ తర్వాత 1954-56 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన తర్వాత ఇప్పటివరకు అందరూ క్రికెటేతర వ్యక్తులే ఆ పదవిని చేపట్టారు. దాదాపు 65 ఏళ్ల తర్వాత తొలి క్రికెటర్‌గా గంగూలి(47) అధ్యక్ష పదవి చేపట్టనున్నాడు. గంగూలీ ప్రస్తుతం బంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ముంబయి బీసీసీఐ కార్యాలయంలో అతడు అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే.  బీసీసీఐ కార్యదర్శి పదవికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షానామినేషన్‌ దాఖలు చేశారు. అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ ధూమల్‌ కోశాధికారిగా నామినేషన్‌ వేశారు.